పుట:కాశీమజిలీకథలు -02.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

135

దాపంబు గలుగఁజేయును. అట్టి వనములోఁ బెద్దతడవు దిరిగితిని కాని యెప్పటికిని తుదయు మొదలునుఁ గనంబడినది కాదు.

మణిశిలలచేత నడుమ విశాలముగా మార్గంబు లేర్పరుపఁబడియున్నవి. అందు దివారాత్రవిభాగము తెలియదు. పెక్కేల నా చక్కనితోఁటలో నొక్క నిముషము వసియించినం జాలదే! బ్రహ్మపదమేల? దాననేకదా భూమియుందనేక సుకృతములు చేసినవారు గాని స్వర్గమునకుఁ బోవలేరు నీ కతంబున నాకే సుకృతమును లేకనే యట్టి సౌఖ్యంబు దొరికినది. అంతకుమున్ను రక్కసుల రాయిడి కోడి పొదలమాటున డాఁగియున్న వనపాలికలు తిలోత్తమంజూచి ధైర్యముతో బైటికి వచ్చి నన్నుఁ జూచి సంకోచించుచుఁ చేసన్నలఁ చేయుచుండ నవ్వేదండగమనయు, రండు రండు. ఈతం డొక పుణ్యపురుషుండు. రక్కసు లెక్కడికో పోయిరి. మన ప్రభువు రక్తాక్షుం బరిమార్చి రాఁగలండని ధైర్యము గరిపిన వారును సంతోషముతో బయల్పడి జయజయధ్వనులు చేయుచు నాట్యములు సేయఁదొడంగిరి.

బోఁటీ! అచ్చటి పాటలగంధులందరును సన్నని నడుములును గొప్ప పిరుందులును, పలుచనివట్రువ మొగంబులును, విప్పిన నెమలిపింఛముల చొప్పున నొప్పారు కేశపాంబులుం గలిగి తారతమ్య మరయరాక యొక్కపోలికనే వెలయుచుందురు. అన్నన్నా! విధి సృష్టికి మేరలేదు సుమీ? దివిజకాంతలం జూచి మనుష్యకాంతలం దలంచుకొనినంతఁ బరిహాసాస్పదముగా నుందురు. మిక్కిలి సంతోషముతో నత్తోటలోఁ గ్రుమ్మరుచు నొకచోటఁ బలుతెరంగుల మనోహరస్వరంబు లీన గానంబు వెలయింపుచున్న యొకమ్రానుం జూచి యావిశేషంబేమియని యడుగఁగా దిలోత్తమయిట్లనియె. ఆర్యా! ఇది సంగీతవృక్షము. పెక్కండ్రు వైణికులు పాడినట్లు పాడును. గాలి వీచినకొలది వింతవింతస్వరములు, రాగములు జనించును. మా లోకములో నెక్కుడు విశేషమిదియేయని చెప్పఁగా నేను గాంతా! యీవృక్షమునకు బీజమెట్టివి. దోహద మేరీతి? మాలోకమునంబాతిన బ్రతుకునా? దీనివిశేషమెఱిగింపుమనియడిగితిని. అదియుఁ గొంత సేపాలోచించి ఆర్యా! యీపాదపము పూర్వము కైలాసమునందుండునది. శివునింబ్రార్ధించి విష్ణుఁడు తనలోకమునకుఁదెచ్చుకొనియెను. తరువాత నందుండి శతానందుండు ముకుందు నడిగి తనలోకమునఁగూడ దీని విస్తరింపఁజేసెను. బ్రహ్మను వేడికొని యింద్రుడీ లోకములో నాఁటిన మిగుల వ్యాప్తమైనది. అని యావృత్తాంతముజెప్పి యప్పడఁతి నన్నుఁ బట్టణము లోనికిం దీసికొని పోయినది

అయ్యారే! అందుఁగల విశేషంబు లెరిగింప నాకేమియుఁ బాటవములేకున్నది. నేనుఁ జూచినదానిలో సహస్రాంశమైనను నా హృదయంబునం దోచదు, తోచినదానిలో సహస్రాంశమునైనఁ జెప్పనేరుపు లేదు. ఆహా! నేనొక వీథిలో నిలువంబడి చూచితిని. ఎటుచూచినను సౌధములును వీథులునుగానే తోచినవి. ఇది రాజమార్గము, ఇది మేడ, ఇది భూమి, ఇది యాకసమనియు దెలియ శక్యము గాకున్నది.