పుట:కాశీమజిలీకథలు -02.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

కాశీమజిలీకథలు - రెండవభాగము

దిలోత్తమాజయంతులు విహారార్థమై విమానములో వత్తురు. నీవప్పుడా విమాన మెక్కుము. దేవలోకమునకుఁ బోయెదవు. దేవదానవయుద్ధకారణమున దేవతలందరు దనుజులోకమునకుఁ బోవుదురు. తిలోత్తమతో నీకు మైత్రి గలుగును. ఆ కాంత యేకాంతముగా నీకు స్వర్గలోకవిశేషములన్నియుం జూపునని చెప్పి యంతర్ధానము నొందెను.

నేనునుఁ దద్వచనప్రకారము జరిగించి మీలోకమునకు వచ్చితిని. స్వామివచనము తప్పదుగదా. నీవు తిలోత్తమ గావచ్చును. ఈ పైకార్యము నీకతంబున జరుగవలసియున్నది. ఇదియే నావృత్తాంతమని చెప్పితిని. నా మాటలు విని యవ్వనిత తన హృదయంబునంగల భయభక్తివిశ్వాసంబులు మొగంబునఁ గనంబడ నభినయించుచు నోహో! స్వామికార్య మెల్లరకు నాచరణీయమే యగుంగదా? మీకార్యము జక్క జేసెదను. ఇంచుక సేపిందు నివసింపుడు. గ్రామవిశేషము లరసి వచ్చెదనని పలికి నాయనుమతి వడసి యప్పడఁతి వీథిలోనికిఁ బోయినది.

అప్పుడు నందనవనములో నెవ్వరులేరు. రాక్షసభయముచేఁ గాపరులు గూడ పారిపోయిరి. అట్టివనములో నేను యథేచ్ఛముగాఁ గ్రుమ్మరుచు మనోహరములైన పూవులనుగోయుచు మధురములగు ఫలముల భక్షింపుచు సంగీతవృక్షముల గానం బాలింపుచు నీరీతి గొంతతడవు విహరించితిని. మరియు నందున్న విరులేరి, చక్కని దండలు గట్టితిని. ఇంతలో తిలోత్తమ యరుదెంచి ఆర్యా! నేను వీటిలోనికిఁబోయి వచ్చితిని. రాక్షసభీతిచేఁ దలుపులన్నియు మూయఁబడి యున్నవి. ఈ పట్టణమంతయు యంత్రములచే నమర్చఁబడియున్నది. యొకచోఁట కీలుద్రిప్పినచో మార్గము లన్నియుం గప్పఁబడును ప్రతిగృహమునకు మఱుఁగు తెరవుగలదు. అవి మాకు గాక యొరులకుఁ దెలియవు. నీకా విశేషములన్నియుం జూపెద రమ్మని పలుకుచు నేను గట్టిన దండలు జూచి వెఱుగుపడుచుఁ దొలుత నాకు నందనవనవిశేషములం జూపినది.

చంద్రలేఖా! ఆ నందనవనవిశేషములు చెప్పుటకు నావశమా? ఆహా! అవ్వనములోని తావి యాఘ్రాణించిన సౌఖ్యమును దలంచికొన్న నిప్పుడు గూడ మేనుగరపు జెందుచున్నది. అత్తోఁట స్వర్గపట్టణమునుండి తూర్పుగానున్నది. అందు మొదట విమానశాలలు తరువాత చిత్రశాలలు పిమ్మట విహారశాలలు, అటుపైన రత్నాశాలలు. నడుమ నడుమ ననేకశాలలు గలిగియున్నవి. ఫలజాతులు పుష్పజాతులు క్రొత్తలేకాని చూచినది. మరలిఁ గనఁబడలేదు. అత్తోటలోఁ బోవుచుండ నొకదండ వర్షాకాలము పోలిక జలయంత్రములఁ జిమ్మె డు తుంపురుల బెంపున మేనుదడియును. ఒక పొంత హేమంతమురీతి మకరందమిళితమగు శీతలమారుతములఁ జలి జనియించును. ఒకచెంత వసంతముభంగి సర్వసుమనస్సంపూర్ణంబై మలయానిలములు హాయిసేయును. ఒకఛాయ గ్రీష్మమతెఱంగున రవికాంతశిలాదీప్తికలాపంబులఁ