పుట:కాశీమజిలీకథలు -02.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

133

కింపురు - ఇంద్రుఁడు కొంతసేపు తడఁబడచు మరల ధైర్యము దెచ్చుకొని, అచ్చటికి రాక్షసులు పోరాదని చెప్పెను. పురుహూతువచనములు వినినతోడనే రక్తాక్షుఁడు రక్తాక్షుఁడై యేమి యింద్రా! మాకు దేవసభకుఁబోవుటకు నర్హత లేకపోయెనే. కానిమ్ము. నిన్ను బరిమార్చి యీరాజ్యము గైకొనిన నేమిచేయుదువో. అప్పుడైననుఁ దగుదుమా, అని యీరీతి సారెసారెకు ధిక్కరించి పలుకుచుండ నలుక జనించి, యింద్రుడు నుక్కుమెయి రక్కసులతోఁబోరాడ దేవతలఁ బురికొల్పెను. అప్పుడు దేవదానవులకు గొప్పయుద్ధము జరిగినది.

సిద్ధులు - దేవతల కెప్పుడును రక్కసులే హృదయశూలములైరి. తరువాత.

కింపురు — అనంతరమున రక్తాక్షుండు సహస్రాక్షు నోడించి పాశంబులఁ గట్టి జయజయధ్వనులతో తనలోకమునకుఁ గొనిపోయెను. దేవతలు అనాథులై వాని వెంటనంటి యూఱకపోయిరి తరువాత రాక్షసులు చేయుచున్నయల్లరి నేమనిచెప్పము. కనంబడినవారినెల్లఁ బట్టి వేధింపుచున్నారు. మేము రాయిడికోడి పారిపోవుచున్నవారము. మీరుగూడ నిప్పుడు స్వర్గమునకుఁ బోకుఁడు వృథగాఁ గట్టడులు బడియెదరు.

సిద్ధులు - ఆలాగునా, అయ్యో! పాపము మన యింద్రుని పనియేమగునో కదా! అని వెఱచుచు నందరు వడిగాఁబారిపోయిరి.

ఆ సంవాదమంతయు మావిమానము ప్రాంతమందే జరిగినది. అట్టి సంవాదము విని జయంతుఁడు తిలోత్తమంజూచి వాల్గంటీ! వీరిమాటలు వింటివా నీవింటికిఁబొమ్ము. నేనారక్కసుని యుక్కు మాపి మాతండ్రిని విడిపించుకొనివచ్చెదను. నేను లేకపోవుటఁగదా యింత పుట్టినది. కానిమ్ము. అని పలుకుచు నాయుధములు ధరించి రౌద్రాకారముతో వడిగా విమానము దిగి యెక్కడికోపోయెను.

అత్తరినత్తిలోత్తమయు నావిమానము నందనవనములోనున్న విమానశాలలోనికిఁబోయిన నందు దిగఁబోవుసమయమున నన్ను జూచినది నేనునుఁ బురుషులెవ్వరు లేరను ధైర్యముతో స్తంభము మాటునుండి దానికన్నులంబడితి. అక్కన్నియ నన్నుఁ జూచినతోడనే విస్మయమందుచు అయ్యా! తమరెవ్వరు? ఈవిమానముమీఁదికెట్లు వచ్చితిరి. మీరు నివసించు లోకమెచ్చట. మీవృత్తాంతము చెప్పుఁడని యడిగినది. నేనునుఁ గొంచెముసేపాలోచించి యింతీ! వినుము. మా కాపురము శ్రీజగన్నాథము. నేను స్వామిభక్తుఁడను, నా పేరు రుచికుఁడందురు. సరితము మాలికలు గట్టి స్వామి కర్పించుచుందును. ఇట్లుండ నేను మొన్నను స్వర్గవిషయములన్నియు నొకచోటఁ బురాణములో విని దాని జూడవలయునని వేడుక పడుచు స్వామిని ప్రార్థించి నిద్రఁబోయితిని.

భక్తపరాధీనుడగు జగన్నాథస్వామి నాకుఁ గలలో దర్శన మిచ్చి వత్సా! నీవు చింతింపకుము. నీయభీష్టము తీర్చెదను. ఱేపటిరాత్రి యీయూరనున్న చంద్రలేఖ యను వేశ్యామణి పెరటితోఁటలోని యశోకపాదపము నెక్కియుండుము. అచ్చటికిఁ