పుట:కాశీమజిలీకథలు -02.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కాశీమజిలీకథలు - రెండవభాగము

అప్పుడు పుష్పముల నాఘ్రాణించుచుఁ తిలోత్తమ జయంతునితో మనోహరా! ఈ విరులు మిగుల వింతగానున్నవి ఇట్టివి మనలోకములో నున్నవియా! మనుష్యులు మనకంటెఁ దక్కువవారని చెప్పెదరే! వారికిట్టి భోగ్యవస్తులేటికి; వారును మనవలెనే సౌఖ్యము లనుభవింతురేమో? నీవెప్పుడైనను చూచితివా అని అడుగ నతఁడు నవ్వుచు బువ్వుఁబోఁడీ! మనుష్యులు మాత్రము సామాన్యులను కొంటివా యేమిఁ వారిలో భోగమునను రూపముననుఁ ప్రభావమునను మనల నతిశయించువార లనేకులు గలరు ఇంతయేల మీలో మిగులసొగసుకత్తెయగు నూర్వశి భూలోకచక్రవర్తియైన పురూరవుని వరింపలేదా? మాతండ్రి యహల్యమూలముననేకదా సహస్రాక్షుండను నభిఖ్య వహించుట. అందు జరామరణవ్యాధులు క్షుత్పిపాసలును గలిగి యున్నవి. మన కవి లేవు. ఇదియే మనకును వారికినిఁగల తారతమ్యము. ఇందున్న వృక్షజాతులన్నియుఁ బ్రతినామముచేత నందొప్పుచున్నవి. ఒక సంగీతవృక్షము మాత్రము భూలోకములోలేదు. తక్కినవన్నియుం గలవు. అని యీరీతి యిష్టగోష్టీవినోదమునం బోవుచున్నంత నా ప్రాంతమందు వడిగాఁ బారిబోవుచున్న కింపురుషులకును వారి కెదురపడిన సిద్ధులకును నిట్టిసంవాదము జరిగినది.

సిద్ధులు — కింపురుషులారా! కడువేగముగాఁ బారిపోవుచున్న వారేమి? స్వర్గమున నేమైనను విశేషములు జరుగలేదుకద?

కింపురుషులు - అయ్యో! మీకింకనుఁదెలియలేదు. కాఁబోలు ఇప్పుడు స్వర్గమున గొప్ప యలజడి జరుగుచున్నది. పాపము మనయింద్రుని కిట్టి యవస్థ యెప్పుడును రాలేదు.

సిద్ధులు — ఆఁ! ఏమేమి? ఇంద్రునకే! యెవ్వరివలన! వడిగాఁజెప్పుడు.

కింపురు - రక్తాక్షుఁడను రాక్షసుడు వరగర్వమునం బ్రబలి పెక్కండ్రు రక్కసులతో వచ్చి స్వర్గమును ముట్టడింప దేవేంద్రుడు వానిబలమెఱింగి బలవద్విరోధమునకు వెఱచి వాని కెదురేగి వినయపూర్వముగా బ్రార్ధించి నందనవనములో విడియఁజేసెను.

సిద్ధులు - అది మంచిపనియే. తరువాత.

కింపురు — ఇంద్రుఁడు వానికిని వానిపరిచారకులకును నప్పుడు చేసిన యుపచారములేమని చెప్పుదుము వానినేమియుఁ బాటింపక వాఁడు పురముచూడవలయునని బయలువెడలి దేవతాగృహము లన్నియు వాని రాయిడికివెఱచి మూసియుండుట జూచి యహంకరించి యౌరా! నేనీయూర విహరింపరాగా దేవకాంతలందరు నుపహారము లియ్యక వంచనమైఁదలుపులు మూసికొనిరే! ఇదియంతయు నీకపటమే ఇట్టి నీతో మాకు మైత్రి యెట్లనిపలుకుచు సుధర్మకు దారిఁజూపుమని యింద్రునడగెను.

సిద్ధులు - ఆహా! దుర్జనులెప్పుడైనను సామమునఁ జక్కఁబడుదురా! తరువాత.