పుట:కాశీమజిలీకథలు -02.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

131

జయంతుని కథ

ఇంతలో సమీపమున నెవ్వరో మాట్లాడుచున్నట్టు ధ్వని వినఁబడినది. అదిరిపడి తలపైకెత్తి చూచితిని. మెరపుతీవంగల కాంతులు ప్రోగుపడి నామీద బడుచున్నట్లు తోచిన విస్మయముతోఁ బరిశీలించునంత నాకాంతిమండలము నేనున్న మ్రానుదండకేవచ్చి యల్లన నిలువంబడినది. అప్పుడు నాకది కనకమణిస్యందనమని తెల్లమైనది. పిమ్మట నాకందున్న వారి మాటలుగూడ నిట్లువిననయ్యె. తిలోత్తమా! మన పయనమున కంతరాయము గలుగఁజేసి గంధవహుండే తత్ప్రసూనవాసనావిశేషం బాతిథ్యముగ నిచ్చి నాసాపర్వంబు గావింపుచు నిచ్చటికిఁ దోడ్కొని వచ్చె గదా! ఈ యద్యానవనము జూడుము. నీమాటలం ద్రోచి పోవుదమనుకొంటిని గాని యేతదాగమనము సాద్గుణ్యమే యైనది. వేగమపోయి నీ యిచ్చకు వచ్చిన బూవులం గోసికొనిరమ్ము లెమ్ము. అనుటయు నొకతరుణి మరల వానితో జయంతా! నేనెంత సంతసమునులేక నిన్నూరక నింతదూరము దీసికొని వత్తునా! ఇది అద్భుతసౌరభ్యము వలె బొడకట్టినది. ఆహా! మన దేవలోకమువలె భూలోకమునను మంచి పుష్పజాతులు గలిగియున్నవే! అందు నేనొంటిమైఁ బోవలేను. నీవుకూడ రావలయునని పలికినది. అప్పుడతండు బోఁటీ! వెఱవకుము. ఇది యర్ధరాత్రము. ఇందెవ్వరును లేరు. యధేచ్ఛముగాఁ బూవులు గోసికొనవచ్చును. నేనును వత్తునని పలుకుచు మెల్లన లేచి యాచిగురుబోఁడి పాణిపల్లవమును గైకొని భేచరత్వమున నాతోఁటలోనికి దిగిరి. ఆ విమానమచ్చటనే యున్నది. నేను వారి రూపములు భాషణములు వేషములుఁజూచి దేవతలని తలంచి దివ్యదర్శనమునకు సంతసించుచు వారుపోయిన జాడఁజూచి మహా సాహసముతో నాకొమ్మలమీఁద నిలువఁబడినంత నాయరదము చేతికందినది.

మెల్లన దానిపై కెక్కి చూచితిని అది రెండంతరములు గలదిగా నున్నది. మొదటిది రత్నస్థంభభూయిష్టమై యున్నది. రెండవది రత్నాసనశయ్యాచిత్రవస్తుమండితమై యొప్పారుచున్నది. అది వారు నివసించు తావని యూహించి మొదటియంతరమున రతనపుకంబళముల చాటునఁ జిత్రప్రతిమవలె దాగియుంటిని. ఇంతలోఁ బూవులఁ గోసిఁకొని వారిరవురు మాటలాడుకొనచు వచ్చి యావిమాన మెక్కిరి. అది యేమి మహిమయోకాని యాయరదము వారెక్కిన తోడనే మరఁ ద్రిప్పినట్టు రివ్వునఁ గదలి వాయువేగముగఁ బైకి నడువఁదొడంగినది. దానికిఁ జక్రములు గాని రెక్కలుఁగాని యేవియునులేకయే యట్లునడుచుచుండుట దేవతామహిమ అని యూహించి నేనందుండి భూలోకము చూడ నేమియుం గనఁబడినదికాదు. అంతయు నలికికొని పోయినట్లున్నది. ఇంచుకయుఁ గుదుపులేదు. స్థంభమునుఁ గౌఁగలించుకొని కూర్చుంటిని.