పుట:కాశీమజిలీకథలు -02.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

కాశీమజిలీకథలు - రెండవభాగము

నెలవునకుఁబోయిరి. మునుపటికన్న నద్భుతతేజమున మెరయుచున్న రుచికునింజూచి చంద్రలేఖయుఁ దిలోత్తమయుఁ వెరగుపడుచు మాట్లాడవలయునని తత్తరపాటుజెందుచు నెట్టకే లాపుకొనియున్న సమయంబున గౌతముఁడు చంద్రలేఖం జూచి గురుతుపట్టి యబ్బురపాటుతో బోఁటీ! యిచ్చటి కెప్పుడు వచ్చితివి? నేను గౌతముఁడ నితఁడు నా మిత్రుఁడు రుచికుఁడు జ్ఞాపకమున్నదా అని అడిగిన విని అమ్మించుబోడి లేచి వారికి నమస్కరింపుచు నందున్న పీఠములఁ గూర్చుండ నియమించి యల్లన నిట్లనియె.

గౌతమా! నీవు నన్ను గురుతు పట్టగలవో లేవోయని మాట్లాడితినికాను. పాపము నీ వీరుచికుని నిమిత్తము చాలా శ్రమపడితివి. ఈతండెందు గనఁబడెను. విశేషములేమి. చెప్పమని యడిగిన అమ్మగువ కతం డిట్లనియె. చంద్రలేఖా! మావృతాంతము చాలగలదు నీ వీవీటి కెప్పుడువచ్చితివి. ఈ మంత్రిగారికిని నీకును సంబంధ మెట్లు కలిగినది. నీవృత్తాంతము ముందుజెప్పుమని యడిగిన జంద్రలేఖ తాను జగన్నాథము విడిచివచ్చినది మొదలు నాఁటితుదదనుకి జరిగిన కథ అంతయు జెప్పి మరియు నిట్లనియె.

ఆర్యా! నీ మిత్రుని చరిత్ర మింద్రజాలమువలె నున్నది. జగన్నాథములో నంతర్ధానమై రామచంద్రనగరములో దిలోత్తమ నుత్తలపెట్టి ఢిల్లీనగరములో నీకుఁ గనంబడెను. రెక్కలుగట్టుకొని తిరిగెడి వారైన నిట్టిచిత్రములు చేయలేరు. మమ్మతడు మరచినను మేమితని నిమిత్తమే యిడుములఁ బడుచున్నారము. ఈ చిన్నదియే తిలోత్తమ. ఇతని నిమిత్తమై యిట్లు జోగురాలైనది. కానిమ్ము. దైవికమునకు వగచినం బ్రయోజనము లేదు గదా! తదీయవృత్తాంతము విన మాశ్రవణము లుత్సుకత నొందు చున్నవి. అనిన విని రుచికుండు విస్మయశోకసంభ్రమంబులు చిత్తంబుత్తలపెట్ట నల్లన నిట్లనియె.

చంద్రలేఖా! మీరు నానిమిత్తము మిక్కిలి యిడుములం గుడుచుచున్నారు. ఇందులకు మీకు కృతజ్ఞుఁడునై యుండెదను నా వృత్తాంతము వినుడు. నాఁటి రాత్రి నీ యుద్యానవనములోనికి బోయి తలుపులు వైచుకొన్నది. నీవు చూచితివికదా! తరువాత నేను నలుమూలలు బరికించి యెందు నిలిచిననుం దెలిసికొందురని తలంచి యేబలవితానములచే దట్టముగ నల్లుకొనఁబడిన నొక యశోకపాదపమునెక్కి చిట్టచివర కొమ్మలసందున నాకుమరుగు పిందివలె నణఁగియుంటిని.