పుట:కాశీమజిలీకథలు -02.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

కాశీమజిలీకథలు - రెండవభాగము

నకుఁ గారణము. నన్నూరక నిందించెదరేల? మీ యనుమతి లేనిదే పోఁగూడదని యుంటి మీకిష్టమేని నిప్పుడే పోవుచున్నానని పలికి వారి యిల్లు వెడలిపోయితిని.

అప్పుడు నాకు మరియొక చోటికిఁబోవుట కిష్టంలేక తిన్నగా, నీయాలయములోనికి వచ్చి యీ విజ్ఞానయోగి నాశ్రయించితిని. అయన నన్ను శిష్యకోటిలోఁ జేర్చుకొనియెను. నిత్యము నయ్యోగిపుంగవుని బోధామృతమువలనఁ దృప్తినొందుచు సాయంకాలమున నీతారకేశ్వరుని గానము సేయుచు హాయిగాఁ గాలము గడుపుచుంటిని. భక్తురాలని పేరు పెట్టి నిత్యము స్వామి ప్రసాదమే నాకిచ్చునట్లు ధర్మకర్తగా రానతిచ్చిరి. ఇదియే నా వృత్తాంతమని పలుకఁగా విని మంత్రిరూపముతో నున్న చంద్రలేఖ తిలోత్తమ యవస్థకు మిక్కిలి వగచుచు బలసింహుఁడు చేసిన కపటోపాయమునకు వెఱుఁగందుచు రహస్యముగాఁ దిలోత్తమకుఁ దన వృత్తాంతంబు చెప్పవలయునని నిశ్చయించి కర్తవ్య మెద్దియని యాలోచించుచున్న సమయములో ద్వారపాలకుఁడు వచ్చి అయ్యా! విదేశ బాహ్మణుఁడెవ్వఁడో తమ దర్శనము చేయుటకై ద్వారమున వేచియున్నవాఁడు. తమతో నేదియో మనవి చేసికొనునఁట, బ్రవేశమునకు సెలవేయనుటయు నామంత్రి బ్రాహ్మణుల కవసరమేల రమ్మని చెప్పుమని యానతిచ్చెను.

అప్పడాప్రతీహారి యాబ్రాహ్మణుం దీసికొనివచ్చి మంత్రి ముందరవిడిచి వారే ప్రభువువారని చుపించెను. మంత్రియు నాబ్రాహ్మణునిం జూచినతోడనే ముఖము వికసింప నమస్క రించి కూర్చుండ నియమించి యాగమనకారణంబడిగెను. అప్పుడా బ్రాహ్మణుఁ డాశీర్వదించి అయ్యా! నావత్తాంతము వినుడు. నాపేరు గౌతముఁడు. నాకాపురము జగన్నాథము. నేను రుచికుడను మిత్రుని వెదకుటకై బయలుదేరి యనేకపురములు చూచుకొనుచు ఢిల్లీ రాజధానిఁ జేరితిని. అందు దైవానుగ్రహమున నా మిత్రుఁడు కనబడియెను. వానిని వెంటఁ బెట్టుకొని యచ్చటనుండి బయలుదేరి నాలుగు దినములక్రిందట నీయూరు చేరితిని. ఇందుండి మా దేశమునకు నోడమీఁదఁ బోవలసి యున్నది. నేటిసాయంకాలమునఁ బ్రవహణము విడుతురఁట. విదేశాగతుల నెక్కుడుగఁ బరీక్షించినంగాని యాజ్ఞాపత్రికలనియ్యమని మీక్రింది యధికారులు చెప్పుచున్నారు. మేము మాదేశము విడిచి చాలాకాలమైనది ఎట్లయిన మా ప్రయాణము నేడు నాగున ట్లాజ్ఞాపత్రికల నిప్పింపఁ బ్రార్థింపుచున్నాఁడ. నిదియే నాకోరికయని చెప్పిన విని మంత్రివేషముతో నున్న చంద్రలేఖ ఆశ్చర్యసాగరమున మునిగి యొక్కింత తడ వొడ లెఱుంగక ధ్యానించుచు సంతోషము మనంబునఁ బొంగుచుండ నాహా? కాలమే మంచిచెడ్డలఁ గూర్చును. ఓర్పుగలిగిన సుఖములు గూడ, దుఃఖములు వచ్చినట్లప్రయత్నముననే వచ్చుచుండునని పెక్కు తెరంగులఁ దలంచుచు నాసంతోషము దెలియనీయక గౌతముని జూచి యిట్లనియె.

ఆర్యా! మీరు నేఁడే యోడ నెక్కి మీ దేశమున కేగఁదలంచు కొంటిరేని మిమ్ము నేను స్వయముగాఁ బరీక్షించెదను. మీ మిత్రుని దీసికొని మాయింటికి రండు.