పుట:కాశీమజిలీకథలు -02.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలదేవుని కథ

127

    గోరినరానిచోఁ గలిగి కోల్పడుచో వెతగాన సజ్జనుల్
    గోర రనాస్థఁబ్రాప్తములు గొందురుకుందురు వస్తుహానికిన్.

శా. ప్రారబ్ధంబగుమేననేయనుభవం బౌచుండఁ దత్సాక్షివై
    యారూఢస్థితి సర్వము న్మఱచి సర్వాస్థలం జిత్వుధా
    భారాసావసుఖాస్తి సర్వగత శుద్ధబ్రహ్మ మేనంచు శం
    కారాహిత్యముమానుమీ యదియు మోక్షప్రాప్తికిన్ బాలకా.

వ. ఈ రీతి నుపదేశించు నయ్యోగిపుంగవుని వచనంబు లమృతబిందువుల వలె నా చెవుల శోకినంత నేనత్యంత సంతోషముఁ జెంది యోహో! నీవీ మరణోద్యోగము మానుమని భగవంతుఁడు నాకీరూపమున నుపదేశించెను గొబోలు. ఇది యుపశ్రుతియై యుండవచ్చును. బలవన్మరణమువలన నరక ప్రాప్తియగునఁట. ఇచ్చటనేగాక పరమందు గూడ నిడుములం గుడువవలయునా! కానిమ్ము. నాలుగు దినము లెట్లో కన్నులు మూసికొనినఁ బోవును. పడిన దానికన్న నెక్కుఁడనుభవింతునా? ఈ యోగి వాక్యములే నాకు గురూపదిష్టములైనవి. నేను మా యింటివారు లేవకుండఁ బోవలయునని తలంచుచు నప్పుడే యా ప్రయత్నము మాని యింటికిఁ బోయితిని.

ఆహా! దైవము నా బుద్ధి నెంతలో మార్చినో చూడుడు. “బుద్ధిః కర్మాను సారిణి" అని పెద్దలు చెప్పుదురు నా పుణ్యమువలనఁ నేను పోవువరకు మా యింటి వారెవ్వరును లేవలేదు. దేవలునిం దలంచుకొనినంత నాకు వారి యింటికి మరలఁ బోవలయునని మనసు కలుగలేదు. గాని సొమ్మిచ్చికొనిన వర్తకుని మోసముచేయుట కిష్టము లేకపోయినది. నా రాకపోకలెవ్వరును గ్రహింపలేదు. నేనుఁ బూర్వమువలెనే పనులు చేయుచుండ నొకనాఁటి యర్ధరాత్రంబున దేవలుఁడు నేను బరుండియున్న యింటిలోనికిఁ గత్తిదీసికొని వచ్చి నన్ను లేపి యిప్పుడు నీవు సమ్మతింతువా? లేకున్న నిన్నీకత్తితో వ్రేయనాయని యడిగెను. నే నప్పుడు భయఁపడుచు దేవలుఁడు నన్నుఁ జంపుచున్నాఁడో యని యరచితి.

ఆ రొద విని యాప్రాంతమందే పరుండియున్న వాని తలిదండ్రులు తటాలునఁ జనుదెంచి వానిచేతులం బట్టుకొనిరి. వాడు దురహంకారముఖముతో నన్ను విడువుఁడు. ఈ రండనుఁ జంపినంగాని నా కోపము దీరదని పలుకుచుఁ దనచేతులు లాగికొనఁజొచ్చెను. అప్పుడు వాని తండ్రి పట్టుకొనలేక చేతులు విడచెను. ఆ విసరున చేతిలోనున్న కత్తి మిక్కిలి వాడికలది కావున వాని మెడకుఁ తగిలి తల తెగి పడిపోయినది. అప్పుడు వాని తలిదండ్రులు మిక్కిలి శోకించుచు ననుఁజూచి అమ్మా నీవు మా కొంప తీసితివి. నీ మూలముగా మా వంశనాశనమైనది. నిన్నిందులకే కాఁబోలు కొంటిమి. నీకుఁ బదివేల నమస్కారములు నీ యిష్టము వచ్చినచోటికిఁ బొమ్మని నిందించుచుఁ బలికిన నేనును అయ్యా! నేనేమి జేసితిని. వాని దుర్బుద్ధియే వాని మరణము