పుట:కాశీమజిలీకథలు -02.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తురాలి కథ

125

వింపక తీరునా? ఔరౌరా! నా విద్యయు నా రూపము వీరింట దాసీ కృత్యమునకు వినియోగించెనే! అని అనేక ప్రకారములం దలపోసి నాఁటిరాత్రి బలవన్మరణము చేయుటకు నిశ్చయించుకొంటిని.

అంత నర్ధరాత్రంబున నింటివారందరు నిద్రఁజెందియుండుటఁ దెలిసి యిల్లు వెడలి యీ దేవాలయములో నూతినంతకుమున్ను చూచి యున్నకతంబున నందు దేవసన్నిధానమున మృతినొందిన పుణ్యమని తలంచి మెల్ల మెల్లగా నిచ్చటికి వచ్చితిని. ఈ గుడి తలుపులు రాత్రులుగూడ మూయకయే యుండును. నేను లోనఁ బ్రవేశించి యానూతిగోడ పైకెక్కి దూకుటకుఁ జేతుల పైకెత్తి భగవంతుని స్మరించు నంతలో నొకమాట జ్ఞాపకము వచ్చినది. అయ్యో! నే నిప్పుడు చచ్చుటకు సిద్ధముగానుంటిని. ఇట్టి సమయమున నీతారకేశ్వరస్వామికిఁ బ్రదక్షిణము చేసివచ్చిన ముక్తి గలుగునుగదా! అట్టి పని నిమిషములో చేసి మరల వచ్చెదంగాక అని తలంచి యానూతి గోడదిగి యుత్తరపు దిక్కుగాఁ బ్రదక్షిణము జేయఁబోయితిని.

బలదేవుని కథ

ఆవైపుననున్న మంటపములో నగ్ని వ్రేల్చెడి వెల్తురుననెద్దియో మాట్లాడుచున్న జనులసందడి యొకటి వినంబడినది. దానికి నేను సంకోచింపుచు నాదారిం బోయినచో నన్నుఁ బల్కరింతురను వెఱపున నటుపోవక వారు నిద్రబోయిన వెనుక పోవుదమను తాత్పర్యముతో నచ్చటఁ బొంచియుండ వారిమాటలు విననయ్యెను.

శిష్యా! వినుము సంసారము పుత్రదారధనాది సంగమూలకంబై యున్న యది.

ఉ. దేహము వాయుసంచలితదీపిక పుత్రకళత్రమిత్రసం
    దోహము స్వప్నకాలమున దోచెడిసందడి భూరిభోగస
    న్నాహము జంత్రముంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాలమీ
    యైహికసౌఖ్య మేమిసుఖ మంచుదలపగనౌఁ గుమారకా.

మఱియును—

సీ. కామరోగాదిదుష్కరశత్రువర్గప్రతాపప్రధానము ధనము
    జన్మపరంపరాసంపాదితానేకఘనకర్మజాలవర్ధనము ధనము
    కైవల్యసంప్రాప్తికారణవైరాగ్యధర్మమార్గావరోధనము ధనము
    సకలావగుణపుంజసంశ్రయారూపదారుణనిగళబంధనము ధనము.