పుట:కాశీమజిలీకథలు -02.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఆ వర్తకు డందులకు సమ్మతించి అప్పుడే నన్ను దనవెంటబెట్టుకొని యీ పట్టణమునకుఁ దీసికొనివచ్చి తన భార్య కప్పగించెను. ఆ వర్తకుని భార్యయు నన్ను సగౌరవముగాఁ జూచుచు నాకుఁ దగిన పనులే చెప్పి మన్నించుచుండెను. నేనును ఆమె యందు భక్తివిశ్వాసములుగలిగి తల్లి లాగునఁ జూచుకొనుచు నామె చెప్పిన పనులు మనసు కనిపెట్టి చేయుచుంటిని. ఇట్టులుండగా నావర్తకుని కుమారుఁడు దేవలుఁడను వాడుఁ నన్ను మోహించి యొకనాఁడు తన అభిప్రాయము నాతోఁ జెప్పెను. నేనును వాని మాటలు విని శివశివా అని చెపులు మూసికొని తమ్ముఁడాఁ నేనట్టిపని కొడంబడు దాననుగాను. నీవు నాకఁ దమ్ముఁడవు. నీతలిదండ్రులను నేను తలిదండ్రులే అని నమ్మియుంటిని. మీ తండ్రితో నేను మొదటనే యిట్టిపనుల కొడంబడనని చెప్పితిని. కావున నీవు సోదరీభావముంచి అట్టి అభిప్రాయము మరలించుకొనుమని మందలించితిని. అప్పటి కేమియుం బలుకక యూ చిన్నవాఁడు సిగ్గుపడిపోయి మరి రెండు దినములు గడిచినంత నేనొంటిగా నుండుటంజూచి నాయొద్దకువచ్చి మచ్చెకంటీ! నీవు చెప్పిన మాటలేమియు నాకు నచ్చలేదు. పచ్చవిల్తుడు నన్ను విచ్చలవిడి బడలఁ జేయుచున్నవాఁడు. నీ నియమములకేమిలే; నీచేత దాసీకృత్యములు చేయించుట మానిపించి నిన్ను మంచిస్థితిలోనికి రప్పించెద. నేను చెప్పినట్లు చేయుమని పలుకుచు నా చేయి పట్టుకొనఁ బోయెను.

అప్పుడు నేను భయఁపడుచు వడివడి పరుగుపెట్టి అతని తండ్రి యొద్దకు బోయి దేవలుఁడు చేయుచున్న దుష్కృత్యములెల్ల జెప్పితిని కాని యావర్తకుఁడు తన కొక్కడే కుమారుఁడు గావున వానిని మిక్కిలి మందలింపనేరక నాతో నేను వానిని దండింతునులే పొమ్మని పలికెను. గట్టిగా నట్టిపని చేయలేకపోయెను. పిమ్మటఁ దల్లితో చెప్పితిని. యామెయు వాని నేమియు ననలేక నన్నెప్పుడు వాఁడున్న చోటికి బోవద్దని చెప్పినది.

ఆ మాటలందు విశ్వాసముంచి నేనట్లు చేయుచుండగా మఱి రెండు దినములు పోయిన వెనుక నొకనాఁడు వాఁడు నాకెదురుపడి నన్నుఁ జూచి శిరఃకంపము చేయుచు గానిమ్ము, నీవు నేనడిగిన వార్త యెల్లరకు వెల్లడిచేసితివిగదా వారు నన్నేమి చేసిరి. ఇప్పటికైన నాప్రజ్ఞ తెలిసినదా. ఈ మాటైనను సమ్మతింతువా అని పలుకుచుండఁగనే ఆవలకుఁ బారిపోయి యా వర్తక యిరుగు పొరుగువారితో జెప్పగా వారును నావర్తఁకుడు మిగుల భాగ్యవంతుఁడగుట నతనితో నేమియుఁ జెప్పలేకపోయిరి. అప్పుడు నాదురవస్థ అంతయుం జింతించుకొనుచు ఛీ! నావంటి మూడురాలీ లోకములోలేదు. మహారాజవైభవమంతయుఁ బోయినను స్వదేశము విడిచినను, నొకరి యింట దాసినై యున్నను నాకింకను జీవితాశ వదలకున్నది ఆహా! ఇంక నేను బ్రతుకుట యేమిటికో తెలియకున్నది? ప్రారబ్ధ శేషమింకను మిగిలియున్నది కాబోలు అనుభ