పుట:కాశీమజిలీకథలు -02.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కాశీమజిలీకథలు - రెండవభాగము

నిప్పు డిది సత్యము అది అసత్యము అని వాదించి చెప్పుట నాకేమి అవసరంబున్నది. అట్టి యాప్తులతో వియోగము గలిగినది గదా? నేను బ్రతికియున్నను లాభ మేమి అని పెక్కుతెఱంగులం దలంచుచు నెట్టకేలకా మంత్రితో నిట్లనియె.

అయ్యా! నే నిట్టిపని చేయుదునని మీకు సమ్మకము తోచినచో నన్ను సత్వరంబుగా శిక్షింపుఁడు. అని పలికి కన్నులు మూసికొని తలవాల్చి యూరకున్నది. అప్పుడు మంత్రి చెలువా! నీ వీరీతిఁ బలికిన మేమేమి చేయుదుము నీవు నేరంబు చేయనట్టు నిదర్శనంబులున్న వక్కాణింపుము. లేకున్న శిక్షకుఁ బాత్రురాలవే అగుదువు నిజము చెప్పుము. అని అడుగ నేనట్టి పనిచేయుదునని మీకు నమ్మకము దోఁచినయెడల నన్ను సత్వరముగా శిక్షింపుఁడు అని పలికిది. వారెన్నిసారు లడిగినను వేఱొకమాటలేదు.

అప్పుడు బలసింహుఁడు కోపించుచు నీ కీ అనుమానమేల గలుగవలయును? కన్నములో దొరికిన దొంగ యేమని బొంకునో చెప్పుము. అది చెప్పిన మాటలలో నొప్పుకొనునట్లు సూచన కాలేదా? తప్పక దీని దండింపవలయునని చెప్పెను. బుద్ధిమంతుఁడగు మంత్రి బలసింహా! తొందరపడకుము. ఈమగువ మొగంబు చూడ నేరము చేసినట్లు కనంబడదు. ఇది యిట్లు చెప్పుటకు వేరెద్దియో కారణముండ వచ్చును. ఈ మంధర చెప్పిన మాటలు నాకంత విశ్వసనీయంబులుగాఁ దోచలేదు. ఇత్తరుణి తిలోత్తమకన్న విద్యారూపంబులచే నధికురాలైయున్నది. ఇప్పడఁతి యొడంబడునేని మహారాజులై నను శుద్ధాంతకాంతగా స్వీకరింతురు. ఇట్టి తరుణి యొకరికి దూతికాకృత్యంబు జరుపుట కేమి యవసరము కలిగెడిని తిలోత్తమయందు దీనికి సహజానురాగము గలిగియున్నదని నేనుఁ జెప్పగలను. తద్వియోగశోకంబుచేతనే యిట్లనుచున్న యది. కావున నీపూఁబోణి దండ్యురాలు కాదని చెప్పెను. బలసింహుఁడును రాజు నెదుట దాని దండింపక తీరదని వాదించెను

మంత్రికిని బలసింహునకును దానిగురించి పెద్దతడవు పోట్లాట జరిగినది. రాజు మంత్రిమాట మన్నింపక బావమరది పక్షమే అవలంబించి యతండు నుడివిన శిక్ష చంద్రలేఖ కప్పుడే విధించెను. రాజశాసన మెవ్వరు గాదనఁగలరు. చంద్రలేఖను బండి యెక్కించి యూరేగించి బలసింహుఁడు వెంటరా రాజభటులు చటులముగాఁ బలుకుచు నక్కుటిలాలకను సముద్రప్రాంతమందున్న మహారణ్యములో విడిచివచ్చిరి. ఆహా! విధిగతి

మ. ధరఖర్వాటుఁడొకండు సూర్యకరసంతప్తప్రధానాంగుఁడై
     త్వరతోడం బరువెత్తిచేరి నిలిచెం దాళద్రుమచ్చాయఁ ద
     చ్చిరమున్ తత్ఫలపాతవేగమున విచ్చెన్ శబ్దయోగంబుగాఁ
     బొరి దైవోపహంతుండు బోవుకడకుం బోవుంగదా యాపదల్.