పుట:కాశీమజిలీకథలు -02.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలసింహుని కథ

115

బట్టతలవాఁడు ఎండబాధకు భయపడి తాటిచెట్టునీడకు రాగా తాటిపండు నెత్తిమీదఁబడి తలబ్రద్దలై చచ్చెను. పాపము చంద్రలేఖ వల్లభు నరయుతలంపుతో రామచంద్రనగరము చేరగా నట్టియాపద సంభవించెను. దైవబలములేనివాఁ డెచ్చటికి బోయినను ఆపదలునుఁ గూడనే వచ్చుచుండును. బలసింహుఁడు రహస్యముగా నడవికిఁ బోయి రాజభటులు పురికరిగిన వెనుక తాను మెల్లన నప్పల్లవపాణియున్న తావునకుఁ బోయెను. అమ్ముదిత యేమియు నెఱుంగక నేలఁబడి యుండుటచే బలసింహుని రాకయే యెఱుఁగదు.

పిమ్మట నతండనురాగముతో నా కొమ్మ చేతికట్టులన్నియు విప్పి తదంగస్పర్శవలన సంతోషము జెందుచు తెరవా! కన్నులు తెరువుము. నే నిట్లు చేయించితినని నామీఁదఁ గోపమా యేమి? ఈ అపరాధమునకుఁగాను నిన్ను దగినసౌఖ్యంబునుఁ బొందింతునులే అని అనేకప్రకారముల వన్నెచిన్నెలతోఁ బల్కరించెను. కాని అది యేమియు నెఱుఁగదు. పిమ్మట దాని లేవనెత్తవలయునను తలంపుతో లేచి కొంచెము వంగి చేతులు సాచునంతలో నాప్రాంతమున మృగముల వేటాడుటకై కుమ్మరుచున్న యొక కిరాతుఁ డతనిఁ జూచి యెద్దియో మృగమనుకొని వాడిఁగల యూచతో నేసెను. ఆ శరఘాతంబున నతండు హా! చంద్రలేఖా అని అరచుచు నేలంగూలి తన్నుకొనుచుఁ గొంతసేపటికి బ్రాణములు విడిచెను. అబ్బోయవాఁడును తన బాణంబునం గూలినవాఁడు మనుష్యుడని తెలిసినతోడనే భయపడుచు నాప్రాంతమందు నిలువక యెక్కడికేని పారిపోయెను.

ఉ. రాతిరి మూషకంబు వివరం బొనరించి కరండబద్ధమై
    భీతిలి చిక్కి యాసచెడి పెద్దయు డస్సిన పామువాత సం
    పాతముఁ జెందె దానిఁ దిని పాము తొలంగె బిలంబుత్రోవనే
    యేతరిహానివృద్ధులకు నెక్కటిదైవమె కారణంబగున్.

ఆకలిచేత డస్సి చచ్చుటకు సిద్ధముగానున్న యొక పాము రాత్రియందు యెలుక యొకటి తానున్న పెట్టెకుఁ గన్నము గొట్టి లోపలకురాఁగా దానిం దిని యాకలి యడంచుకొని యావివరంబునుండి పెట్టె వెడలి పారిపోయెను. ఆరీతినే శుభాశుభంబులు యింటిలోనున్నను దైవమే తెచ్చి యిచ్చునుగదా! ఆ యలజడిలో జంద్రలేఖ తెరపి తెచ్చికొని లేచి యెదురనున్న బలసింహునిఁ గాంచి యమ్ము సోకి యతండు గతాసుఁ డగుటయుం దెలిసికొని యాశ్చర్యమందుచు నౌరా యీ దుర్మార్గుఁడు నన్ను గురించి యెట్టి యేర్పాటుఁ గావించెను. వీనిం దైవము తెగటార్చెను. నాచేతికట్లు విప్పినది వీఁడే కావచ్చును. పాప మాహారవస్తువులు గూడ నానిమిత్తము తీసికొనివచ్చెనే! కానిమ్ము. భగవంతునికి నాయందు దయబుట్టినది కాబోలు. ఇప్పుడు నాహృదయంబున దుఃఖమిళితమైన సంతోషంబు కలుగుచున్నది. ఇట్టి సమయమందు ధైర్యమును విడువరాదు.