పుట:కాశీమజిలీకథలు -02.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలసింహుని కథ

113

నున్న మంధర నడుగుఁడు. చెప్పఁగల దనుటయు నృపతి యాదాదిని రప్పించి యడిగిన మ్రొక్కుచు నది యిట్లనియె.

దేవా! యీ చంద్రలేఖ వచ్చినది మొదలు కపటాలోచన చేయుచున్నది. మన తిలోత్తమ నెచ్చటికో తీసికొని పోవలయునని దలఁచుచున్నది. ఆ స్థల మెద్దియో తెలిసినదికాదు నిత్యంబును దాని కెచ్చట నుండియో యుత్తరంబులు వచ్చుచుండునవి. కాని దాని పరిచారిక పూఁబోణి పుచ్చుకొని చంద్రలేఖ కిచ్చిన వానికది ప్రత్యుత్తరములు వ్రాయుచుండును. ఈరీతి జరుగుట నేను గ్రహించి మొన్న నొకనాఁ డాయుత్తరంబులు తెచ్చెడు సమయమున నచ్చటనే కాచి యుంటిని. ఇంతలో నా దూతలు పూర్వమువలెనే యెద్దియో యుత్తరము తెచ్చిరి. అది చూచి నేను వారితో నయ్యా! నేడు పూఁబోణి పనిమీద వెళ్ళినది మీయుత్తరమును నన్నుఁ దీసికొనిరమ్మని చంద్రలేఖ పంపినది. కావున మీరు తెచ్చిన యుత్తరంబు నా చేతికిండని యడిగితిని. వాండ్రు నా మాటలు సత్యమే యనుకొని యాయుత్తరంబు నాకిచ్చి మేమిచ్చటనే యుందుము ప్రత్యుత్తరంబు వడిగాఁ దీసికొని రమ్మని చెప్పిరి.

పిమ్మట నే నాయుత్తరము విప్పి చదువఁగా నిట్లున్నది. చంద్రలేఖా! నీవు బోయి పెక్కుదినంబులైనది. తిలోత్తమ నెప్పుడు తీసికొని వత్తువో తెలియదు. నేను నీ విరహముచేతఁ గృశింపుచు గడియ యుగముగాఁ గడుపుచుంటిని. ఎట్లయినను కార్యము సఫలము చేసికొనిరమ్ము. నీ రాకకు నిరీక్షించుచున్న వాఁడను. ప్రత్యుత్తరమిమ్ము అని యింతవరకుఁ జదువునంతలో చంద్రలేఖ పరిచారిక పూవుఁబోణి వడివడివచ్చి నాచేతిలోని యుత్తరము లాగికొనినది. కావునఁ దరువాత నేమియున్నదో చదువుటకు వీలు పడినది కాదు.

అప్పువ్వుఁబోణియు నేనది చదివినందులకు మిగుల కోపము చేయుచు గానిమ్ము తిలోత్తమతోఁ జెప్పి నిన్ను దండింపఁ జేయుదునని పలికి పోయినది తరువాత నే నీసంగతి నెవ్వరితోఁ జెప్పక యీ అయ్యగారితో మాత్రము జెప్పితిని. ఇదియే నే నెరిఁగిన సంగతి. ఇంతకన్నా నాకేమియుం దెలియదని అదరును బెదరును లేక చెప్పినది. దాని మాటలు విని అచ్చట నున్నవారెల్ల వెఱఁగు పడఁజొచ్చిరి. అప్పుడు మంత్రి తక్షణమే యా చంద్రలేఖం బిలిపించి మందర చెప్పిన మాటలన్నియును మరల వినిపించి దీనికి నీవేమి చెప్పెదవని అడిగెను.

ఆ మాటలువిని చంద్రలేఖ మ్రాన్పడి యొక్కింతసేపు కన్నులు మూసికొని యూరకుండి హా? విధీ! నన్నెట్టి యాపత్సముద్రంబులో ముంచితివి. ఇప్పుడు నేనేమి చెప్పినను వీరికి నమ్మకముఁ దోచునా! ఈమంధర నాపయింగల కోపముఁ దీర నెంతకల్పనం జేసినది. నా ప్రారబ్ధ మిట్లుండ దానిదూరఁట యేమిటికి. కానిమ్ము. వీరితో