పుట:కాశీమజిలీకథలు -01.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

భుజం – లేదని సందియముగా బలుకుచున్నావు: దీని కత నెరుగవు కాబోలు. ఆరు మాసముల క్రిందట దీని తండ్రి స్వయంవరమునకై పెక్కండ్ర రాజకుమారుల రప్పించెనుగాని వారిలో నొక్కరిని దన చక్కదనమున కీడు కాదని వరించినదికాదు. నే నప్పుడు చూచియే దీనిగుఱించి చింతించుచు నేటికి పవిపట్టితిని.

చార్వా – ఇట్టి యోగము దీనికుండగా నెట్లు వారిని వరించును?

భుజం – ఔనుగాని, చార్వకా నా కీకామిని సోయగము జూచిన నొక్కసారి భోగించి పిమ్మట నమ్మవారికి బలినియ్య నూహ పుట్టుచున్నది. దీనికి నీ వేమని యెదవు?

చార్వా - ఛీ! ఛీ! అట్లు చేసిన అమ్మవారికి గోపము వచ్చి వరమీయదు సుమీ!

భుజం – అమ్మవారి వరము దీని సంభోగసౌఖ్యముకన్న నెక్కువా?

చార్వా - అయ్యయ్యో! ఎక్కువది కాదా? నిజముగా నామెకు గోపమువచ్చిన మనము భస్మముకామా?

భుజం - అలాగైనచో నీపడతి నమ్మవారికి బలియే యియ్యవలదు నేనే పెండ్లి యాడెదను. బలికై వేరొకరాజకన్యం దెత్తుముగాక.

చార్వా - ఓహో! గడుసువాడవే. నీవేనా మగడవు నాకు మాత్రము చక్కనిభార్య దొరికిన నిష్టము లేదనుకొంటివా యేమి ? అట్లయిన నేనే పెండ్లియాడెదను.

భుజం - చార్వాకా! ముందర నీ సంగతి నీవు తెచ్చితివా, నేను తెచ్చితినా, నిజము సెప్పుము.

చార్వా - ఎవరు తెచ్చిన నేమి? దీని హక్కు యిరువురకు సమానమే.

భుజం – ఇంతమాత్రమునకై హక్కులు స్థిరపరచవలెనా? జగడము సేయకు. పోనీ. అమ్మవారికే బలియుత్తములే.

చార్వా - అట్లయిన నాకు సమ్మతమే.

అని యిట్లొండొరులు మాట్లాడుకొనుచు గొంచెము సేపటికి నిద్దురపోయిరి. ఆ సమయములో మేలుకొని వారి మాటలన్నియు వినిన రాముడు వారి నప్పుడు చంప నుంకించుచు నిద్రితులం జంపగూడదను నీతి పాటించి వారి కత్తులను సంగ్రహించి ధైర్యముతో నిదురబోకయే యారాత్రి వేగించెను.

అంత నా తస్కరులు వేకువజాయిన మేలుకొని కత్తులు వెదకి గానక గుడి బయటికివచ్చి నలుదెసలం బరికించుచు నెవ్వరినిం గానక యిది యమ్మవారి మాయ యేమోయని వితర్కింపుచుండ గుడిలోనుండి రెండుజేతుల నమర్చుకొని యొక్క గంతున రాముడు బైటకురికి తస్కరులు బెడర నోరీ దుర్మార్గులారా! రండు. దుర్గకు