పుట:కాశీమజిలీకథలు -01.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

85

పిమ్మట నా పురుషసింహము సింహము దవ్వుగా నరిగెనని యెఱిగినవెనుక యల్లన నత్తరువు దిగి యుల్లము తల్లడిల్ల మెల్లన నడువజొచ్చెను. ఇంతలో నతని స్వాంతమున నున్న దురంతచింతాఢ్వాంతమునకు దోడుగా రే డపరగిరిశిఖరపరిసరముల కఱుగ దెసల జీకటులు గాటుకబూసినరీతి నావరింపందొడంగెను. భయంకరమృగాక్రాంతమగు నక్కాంతారంబున చీకటిని ద్రోవగానక నడుచునప్పు డతం డాయుధమాత్రసహాయంబైన లేమింజేసి జీవితేచ్ఛ వదలి దైవమునే ధ్యానింపుచు నరుగ నరుగ మఱియు నంబరతలమ్మున మేఘమ్ములు గ్రమ్మి యుఱుముల నాకసంబరుల దళుక్కురని మెఱయు మెఱపు జూపులకు మిరుమిట్లుగొలవ బ్రభూతవాతంబుతో బెనువాన గురియజొచ్చెను. ఆ జడి కతడు గడగడ వడంకుచు నడుచునెడ నొకపెడ మెరుపుల వెల్తురున నమ్మవారిగుడి యొకటి గనంబడిన దాని మంచిచెడ్డల విదారింపక శీతభీతి దలుపుల ద్రోచికొని యందు జొరబడి గుమ్మమున దడిగుడ్డం బిండుకొనుచుండెను. ఇంతలో నొకనెలంత యాక్రందనధ్వనితో గొందఱు పురుషుల తర్జనధ్వనులు వినంబడిన భయపడి యతడు గర్భాలయమున కరిగి యందు మిక్కిలి గొప్పది యగు చండికావిగ్రహము మాటున దాగియుండెను .

అంత నొకకాంతం దోడ్కొని భయంకరాకారులగు తస్కరు లిరువురు విచ్చుకత్తులతో నగ్గుడిలో బ్రవేశించిరి. ప్రవేశించునప్పు డమ్మవారి మాటుననుండి రాముండు మెరుంగు వెలుగున మెరపుతీగయుంబోలు యమ్మానిని బిక్కందనుక వ్రేలాడు నల్లని సోగవెండ్రుకలం బట్టి తిరుగుచు కాటుకకొండలవంటి దొంగల విరువురం జూచి యప్పడంతి యెడ గనికరము వొడమినను నప్పటికేమియు జేయరామి దఱి నరయు చుండెను.

ఆ చోరులు నడిదంబుల నొకమూల నిడి యాప్రోయాలు గోలుమని యేడ్చుచు శోకావేశంబున మూర్ఛ మునింగియుండ వారలొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

చార్వాకుడు — ఓరీ! భుజంగా! మనకిదివర కీయమ్మవారికి దొంబదితొమ్మండ్ర చక్కని రాజకన్యల బలియిచ్చితిమి కదా? దీనితో వ్రతము పూర్తియగును. ఇక మన కీచండిక రేపు వాంచితము నియ్యగలదు.

భుజంగుడు — చార్వాకా! మనము గావున నింత యసాధ్యమైన వ్రతమును బూర్తిజేసితిమి. మఱి యెవ్వరైన నూఱుగురు చక్కని రాజకన్యలం దెచ్చి బలి యియ్యగలరా? ఇంతపని జేసినవారి కమ్మవారు వరమియ్యక యే చెరువునీరు త్రాగగలరు?

చార్వా - మన మదివరకు బలియిచ్చిన మచ్చెకంటులలో నింత చక్కనగు నెలత లేదుసుమీ!