పుట:కాశీమజిలీకథలు -01.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

తానొక్కరుండ యయ్యండజయానదండ కరిగి తదీయతారుణ్యరామణీయమున కచ్చెరువందుచు నల్లన నయ్యోషదీకాష్టం బరుగదీసి యాగంధంబు గన్నులకు బట్టించిన వెంటనే యవి యపూర్వతేజంబునం బ్రకాశిల్లుటయు జూచి యాచకోరాక్షి సంభ్రమాశ్చర్యసంతోషకలితమానసయై యెదుర నాశ్వినేయస్వరూపంబున నిలిచి యున్న యామంత్రినందనుం దిలకించి మేను పులకింప నమస్కరించుచు "నీవు నాభర్తవు నాపుణ్యము ఫలించె "నని యనురాగసూచకములగు చూపు లతనిపై బరగించుటయు నతండును గ్రుచ్చియెత్తి గారవించుచు దన సంతోషము వెల్లడించెను.

అ ట్లొండొరుల మనంబులు కలిసికొనినపిమ్మట నావృత్తాంతమంతయు నాధరాకాంతుండు విని యత్యంతప్రహర్షంబున నతని కులశీలనామంబులం దెలసికొని మఱియుం జెలంగుచు దైవమును వేదెరంగుల గొనియాపాడి శుభముహూర్తంబున నతని కారాజ్యముతో గూతు నిచ్చి వివాహ మాచరించెను.

అట్లు రాజ్యముతో మిగులరూపవతియగు నామగువను స్వీకరించి యతం డయ్యంగనతో గొన్నిదినంబు లీడులేని వేడుక లనుభవించుచు నొక్కనా డాప్తులవృత్తాంత మంతఃకరణగోచరమగుటయు నేకాంతముగా గాంతతో నిట్లనియెను.

ప్రేయసీ! మే మేగురము మిత్రుల మొక్కసారి యిల్లువెడలి దేశాటనము జేయుచు నొకవటవృక్షము మూలగా విడిపోతిమి. వారి జాడయేమైనదో తెలియదు. మే మనుకున్న మితియు గడచినది. కావున నట్టి మిత్రుల వెదకివచ్చెద సెలవిమ్మని యడిగిన నమ్మగువయు విడువలేక యెన్నియో ప్రతికూలవాక్యముల జెప్పి యెట్లకేల కతని యనునయవచనంబులచే నొప్పుకొనినది. అట్లు భార్యతో జెప్పి యొరు లెరుంగకుండ నతం డొకనా డర్ధరాత్రంబున మిక్కిలి జవముగల తురగ మెక్కి యొక్కరు డయ్యూరు వెడలి యడవిమార్గంబునం బడి పోయెను. సౌహార్ద్రచిత్తులు భోగములం గణింతురా? అ ట్లెడతెగని యడవిలో మఱునాడు రెండుయామములప్రొ ద్దెక్కినదాక నేకరీతి ప్రయాణము చేయుటచే మిక్కిలి నలసటజెంది గుఱ్ఱము నడువజాలక యొకచెట్టుకడ నిలుచుటయు నతం డది యెఱంగి దానిం దిగి ప్రాంతమందున్న జలాభరంబున వారువముతోగూడ నీరు ద్రావి ఫలహారమున నాకలి దీర్చుకొని మిగులనెండగా నుండుటచే దరినున్న తరువునీడ గుఱ్ఱమును గట్టివైచి యొక్కింతవడి విశ్రమించెను.

అయ్యవసరంబున దిక్కుడ్యంబులు బీటలువారజేయు నొక్కయద్భుతధ్వని వినంబడెను. నిరాయుధుండగు నతం డాభయంకర స్వరమునకు వెరచి మిక్కిలి పొడవగు నయ్యగమాగ్రంబున కెగబ్రాకునంతలో ననంతవేగమ్మున వాలమ్ము విదల్చుచు సింహంబొక డార్పులడర నయ్యెడ కరుదెంచి చెట్టుమ్రోల గట్టియున్న మేలిగుఱ్ఱమును బిట్టు కొట్టుకొనుచుండ మెడబట్టి యీడ్చుకొని పోయినది.