పుట:కాశీమజిలీకథలు -01.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

83

లేదట. అట్టి సొగసుల మగువకు గన్నులు పోగొట్టిన నలువం దిట్టుచు దల్లిదండ్రులే గాక పౌరులుగూడ పూర్తిగా భుజించుట మానివేసిరి.

ఆ రాజు లక్షలకొలది రొక్కము కరుచుపెట్టి పెక్కుచికిత్సలు చేయించెనుగాని దానికన్నులు చక్కబడినవికావు.

మ॥ ద్విజవంశోద్భవుడైన భూపుడయిన • న్విడ్వర్యుడైనన్ జఘ
       న్యజుడై న్ఘనుడైన నీచకులుడై • నన్మత్తనుజాత నే
       త్రజరుగ్దోషము వాయ నెవ్వడు చికి • త్సంజేయునో వానికిం
       ద్రిజగంబుల్గన నిత్తు నత్తరుణి ధా • త్రీరాజ్యయుక్తంబుగాన్.

అని చాటింపించుచున్నవాడు.

నే డాపట్టణముమీదుగా వచ్చుచున్న నా కీ వింతమాత్రము గనంబడినది. ఇంతకన్న నెద్దియు జూడలేదనియె. ఆ మాట వినినతోడనే యప్పతంగాంగన జాలిపడి అయ్యయ్యో! పాప మంత సంపదయు సౌందర్యమును గలిగిన చెలువ గుడ్డిదిగానున్న దని వినిన నాకునుంగూడ విచారమగుచున్నది. అట్టియంధత్వంబు వాయజేయ వైద్యుం డొక్కండు నప్పుడమి లేడాయని యడిగిన మరల విహగపతి యిట్లనియె.

బోటి! మన గూటియందున్న యీ పసికాష్ట మరగదీసి యాగంధ మా పద్మగంధి కన్నులం బట్టించిన జక్కంబడునుగాని వేరొక్కయూషది నేవైద్యుండును బాగుసేయలేడని చెప్పి యాపక్షిపతి యాసతితో రాత్రిశేషము గడిపి యదయమున నెందేని జనియెను.

పక్షిభాషను గుర్తెఱింగిన రాముడు చెట్టుక్రింద బరుండి యా పలుకులన్నియు వినియున్నకతంబున నుదయకాలమున నా చెట్టెక్కి యక్కులాయమందున్న పసికాష్టము సంగ్రహించి యత్యంతసంతోషముతో దిగి సాయంకాలమునకే యా పట్టణము జేరెను.

అందొక బ్రాహ్మణ గృహమందు భుజించి వీథివేదికమీద బండుకొనియుండ బౌరు లానారీమణి చక్కదనముం గుఱించియే చింతింపసాగిరి. అట్టి మాటల నాలింపుచు నతం డారాత్రి యొకయుగముగా గడిపి తెల్లవారినంత నెంతేని సంతసముతో నారాజ నిశాంతప్రాంతమున కరిగి "రాజనందన కన్ను లేను జక్కబరతునని" వక్కాణించినంత బదుగురు చుట్టుకొని యతని రాజునగరికి దీసికొనిబోయిరి.

అ ధాత్రీపతి యావార్త విని యశ్రద్ధ జేసి చాలుచాలు! నిట్టి వైద్యు లనేకు లయిరి. ఏటికి శ్రమయని మొదట నీసడించెను. పదంపడి యతని మాటల పాటవమునుబట్టి యెట్టకేల కొడంబడి యక్కన్యం జూపించుటకై తగిన పరిచారికల నియమించెను.

వారితోకూడ గన్యాంతఃపురమున కరిగి రాముం డందర దూరముగా బొమ్మని