పుట:కాశీమజిలీకథలు -01.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గాంచి హర్షంబున మేను పులకింప మరణభీతి విడచి యమ్మహానుభావు పాదంబులమ్రోల సాష్టాంగ మొరగి యట్టె లేవకున్న యొక్కింతవడి కయ్యోగీంద్రుడు గన్నులం దెరచి పాదంబులంబడియున్న వాని గృపగదుర లేవనెత్తి యోరీ! నీ వెవ్వండ వివ్విపినగుహాంతరాళమున కెట్లు ప్రాణములతో వచ్చితివి? చెప్పుమని యడిగిన నతడు నమస్కరించి తన కథయంతయు జెప్పి రక్షింపుమని వేడుకొనియెను.

అయ్యోగియు నతని సాహసమునకు మెచ్చుకొనుచు నోయీ! పండ్రెండేండ్లకు నొకసారి బాహ్యప్రచారము గలిగిన నా కీదినముననే యట్టి మితియగుటచే గనుల దెరచి నీతో మాటాడగలిగితిని లేనిచో నీవు వృథాగా జావవలసివచ్చును. ఈగుహయందు వచ్చుటకేగాని మరల బోవుటకు దారి గనబడదు. నీమనోధైర్యము గొనియాడదగియున్నది. నీ కేమి కావలయునో కోరుమనుటయు నతం డంధకారబంధురమగు గుహాంతరాళమున నుండి తెరపిగల బ్రదేశము చేరుటకంటె వేరొండువర మేమి తోచమింజేసి తన్ను బాహ్యప్రదేశంబున జేర్చుమని వేడిన నమ్మునియు వాని గన్నుల మూసికొమ్మని యెద్దియో జపించినంత రాముండు తక్షణం బక్కొండ యవ్వలిభాగంబు సేరెను.

అట్టి విషయము గన్నులు దెరచి చూచి ముని ప్రభావమునకు వెరగందుచు దన్ను మరల జనించినవానిగా భావించి యావటవృక్షము జూడ నేమూలను గానక యోహో మోసము వచ్చెనే, నా మది భ్రమసినది. అమ్ముని వర మిచ్చినప్పుడ యామఱ్ఱి మొదలు జేర్పుమనక మరియొకలాగున గోరితినే యిపు డది యేదెస నున్నదో తెలియదు. ఎట్లు మొదలు చేరుదునని పశ్చాత్తాపచిత్తుండై నడువసాగెను.

అట్లు సాయంకాలము దనుక నడచినను గ్రామ మేదియు కానంబడలేదు. విశాలమగు నొకచూతవృక్షము గనంబడినది. అదియు నివాసయోగ్యముగా నుండ నారాత్రి దానిమూలమునం బరుండి తనపయనపువిశేషమును గుఱించి చింతించుచుండ నిద్దురపట్టక రెండుయామములదాక మేలుకొనియుండెను. అట్టియెడ నాచెట్టుమీద గూటిలోనికి రెండుగరుడపక్షులు చేరి యిష్టములైన మాటలం జెప్పుకొనదొడంగెను. అం దాడుపక్షి మగపక్షి కిట్లనియె.

నాథా! మీరు అనేకభూములు తిరిగి వచ్చితిరిగదా ఎందేని వింతలు చూచితిరేని నుడువుడని యడిగిన దాని కాపతంగపుంగవం బిట్లనియె.

కాంతా! నే డెందును నేవింతయు జూడలేదు వచ్చుచుండ నిచ్చటికి రెండుయోజనముల దూరములో నొకపట్టణము గలదు. అప్పట్టణపురాజునకు లేకలేక యొకకూతురు గలిగినది. దాని చక్కదన మీమూడులోకంబులంగల యంగనలకు లేదు. పాప మాపూబోడికి గొలదికాలమై నదెద్దియో రోగమున గన్నులు గాన్పించుట