పుట:కాశీమజిలీకథలు -01.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

81

గనంబడ నందులకు వెరగందుచు నతం డౌరా! యది చూడ నెంతయో లేనట్లుండు. ఎక్కిన కొలది మిగిలియే యుండెను. ఈ కొండ యౌన్నత్యము మిగుల వింతగా నున్నది. దీని రేపుమాత్రము పరీక్షించి కొన గనంబడనిచో మగిడెదంగాక యని నిశ్చయించి యారేయి గడపి మరునాడు చీకటి పడుదనుక నెక్కి చివర జూడలేక విసిగి మగుడ దలంచునంతలో నం దొకగుహ కాన్పించినది. దానిం జూచి ప్రవేశింపందలంచి రాత్రివేళయగుట కొంచెము భయము జెంది యారాత్రి యాగుహాముఖంబున నివసించి మరునా డుదయంబున దానింబడి ధైర్యసాహసంబులే తనకు దోడురా నరిగెను.

సాధారణమైన వెలుగుగల యా గుహలో బడి పోవంబోవ గ్రమంబున నది యల్పమగుచుండుట నిలిచి నడచుటకు వీలులేక గొంచెము వంగియే నడువదొడంగెను. మఱియు బోయినకొలది గుహ చిన్నదియు జీకటి యెక్కుడగుచుండ నడువశక్యము గాక మగిడిపోవుదమని యాలోచించి వెనుకకు దిరిగిన దారియే కాన్పించినది కాదు. అప్పు డతనికి వచ్చినదారియు బోవలసిన దారియు దెలియక దట్టమగు చీకటిలో జేతుల దడిమికొనుచు గొంతదనుక బ్రాకియే యరిగెను. పైన నెట్లును శరీరము పట్టునంత యవకాశము లేనందున నప్పు డతనికి దైర్యమాగినది కాదు. మరణభీతి జనించి యకటా! దైవము నన్నిచ్చటికి జావదోడ్కొని వచ్చెనే? నా సాహసమే న న్నింత జేసెనుగదా! మఱ్ఱికొమ్మతుద గానంబడినతోడనే మగుడక యీపర్వత మేటి కెక్కితిని? ఎక్కియు బయట నరుగక గుహ జొరనేల? సొచ్చియు చీకటి బలియుచుండ మగుడక యింతదవ్వు రానేల? ఇదియంతయు దైవికమేగదా యని యూహించి దైర్యముతో నిట్లు తలంచెను.

మ॥ఎట నెవ్వానికి రేల్సుఖముగా ◆ నీ దుఃఖమున్‌ గాని వి
      స్ఫుటపూర్వాచరితాత్మ కర్మవశతన్ ◆ భోక్తవ్యమై యుండునో
      ఘటనాచాతురి ద్రాళ్ళగట్టుచు బలా ◆ త్కారంబుగా వాని న
      చ్చటికిం దోడ్కొనివచ్చి దాని గుడిపిం ◆ చున్‌ దైవ మన్నా ళ్లొగిన్.

అని బాల్యంబున నాచార్యుఁడు సెప్పిన పద్యమును జ్ఞప్తికి తెచ్చుకొని నాకు మరణమయ్యెడుగాని మరియేమి కాగలదు. అది యెల్లరకు జన్మముతోడనే వచ్చుం గదా? దానికై చింతయేటికి? అనుచు భగవదాయత్తచిత్తుండై మఱిరెండు బారలు బ్రాకినతోడనే కొంచెము వెల్తురు గనుపించినది. దాని యాధారమున మఱిరెండుగజములు నడచిన నందొకకెలన గవాట మొకటి చేతులకు దగిలినది. అది పట్టిలాగిన మణిప్రభలచే బట్టపగలుగానున్న యొక గదియందు దపంబొనరించుచున్న మహర్షిం