పుట:కాశీమజిలీకథలు -01.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

బోయిన నామెయు నప్పటికి దనకేమియుం దోచమింజేసి యెద్దియో వ్రతమిషచే సంవత్సరము మితిగోరినది.

ఆ భూపతియు బలవద్రతి కభిమతములేక యట్టి మితి నిచ్చి దిన మొక్కయుగముగా గడుపుచుండెను. అని యెఱిగించి యంతలో బ్రయాణసమయ మగుటయు గథ జెప్పుట చాలించి యయ్యతి గోపా! పైకథ ముందటి మజిలీలో జెప్పెద. నేడు నడువవేళయైనది. లెమ్మననపుడు వాడు తర్వాయికథ విన వేగిరపడుచు గావడి యెత్తుకొని యాసన్యాసితో నడుచుచుండెను. అయ్యతియు మౌనం బవలంబించి ప్రణవాక్షరజపంబు గావించుచు నడుచుచుండ వాడు వినినకథ యంతయు జ్ఞాపకమునకు దెచ్చుకొనుచు నడుమ నొకసారి యయ్యా! యా వసంతుడు మరల బ్రతుకునా యనియు వేరొకసారి యా రాజకుమార్తెను మరల జేరునా యనియు నతడు మిత్రులతో గలసి కొనునా యనియు వారందరు వింటి కరుగుదురా యనియు బల్కరించుచుండ హస్తసంజ్ఞచే వారించుచు నయ్యతి గ్రమంబున మధ్యాహ్నపుమజిలీ జేరును.

అయ్యతి మునువోలె నట ననుష్ఠాన మంతయు దీరిన వెనుక వంటజేసికొని భుజించి యలసట దీరిన కొండొకవడికి నొకచల్లనిప్రదేశమున గూర్చుండి భోజన మైనది మొదలు కథ చెప్పుమని వేపుచున్న యా గొల్లవాని కిట్లని జెప్పదొడంగెను.

మూడవ మజిలీ

రాముని కథ

గోపా! విను మట్లు దక్షిణపుదెసకు మఱ్ఱికొమ్మమీదుగా నరిగిన మంత్రిసూను డైన రాముడు నాల్గుదినములు సులభముగా నడచి మరిరెండునాళ్ళు ప్రయాసముగా వంగినడుచునంత నంతము గాన్పించినది. కాని యది యొకపర్వతప్రాంతభూమిగా నున్నందున నందందలి విశేషము లరయదలచి యాశాఖ దిగి నడువ నొక గొప్పపర్వతము గానబడినది దాని యౌన్నత్య మఱసెదంగాక యని యతం డది యెక్క నారంభించెను. సాయంకాలమైనను శిఖరము గాన్పించినదికాదు. ఆ రేయి నట ఫలహారమున నాకలి యడంచుకొని మరల దెల్లవారిన తోడనే యెక్క నారంభించెను. సాయంకాలమయినను దుద యగుపడలేదు. మునువోలె నట వసించెను. మరునాటి రాత్రికిని శిఖరము మిగిలియే యున్నది. ఈరీతి నారుదినములు నడచినను శృంగము