పుట:కాశీమజిలీకథలు -01.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

87

మ్రొక్కుడు. మీ శిఖరంబుల ఖండింతు. చండికకు బలినియం దెచ్చిన వనితను జెరుప దలంచిన మీ పాప మూరకపోవునే? శక్తికి భృత్యుండ. నను జూడుడని యడిదముల బెదరించుచుండ వారు కొయ్యలవలె కదలక నిలిచి యేమియుం బలుక నేరక పారిపోవ దలంచునంతలో నతడయ్యడిదముల వారి తలలు నొక్కొక్కవ్రేటున నరికి యమ్మవారికి బలియిచ్చెను

పిమ్మట నతం డాలయములోని కరిగి దేవికి మ్రొక్కి మొగులు మఱుంగున మెరయు మెరపుతీగవలె విడిన సోగవెండ్రుకల నడుమం దళుక్కు మని మఱయు నత్తరుణిమైదీగ కన్నులకు విందొనరింపజేరి నారీమణీ! లెమ్ము లెమ్ము. నీ చింత వాసినది . దొంగలు హతులైరి. తెల్లవారిన దనుటయు నప్పలుకులు రోగార్తున కౌషధమువోలె నన్నాతికి జేతవం బిచ్చిన నల్లనికన్నులం దెఱచి యెదుర కాముడోయన బ్రకాశించు రామునిం గాంచి హర్షపులకితగాత్రియై యక్కాంచనగాత్రి చిన్న యెలుంగున నిట్లనియె.

మహాత్మా! నీ వెవ్వరవు? నిన్ను జూడ నా పదంబుధిమగ్నమైయున్న నన్నుద్ధరింప నేతెంచిన భగవంతుడవని తోచుచున్నది. మీ వృత్తాంత మెఱింగింపుడు. ప్రాణదానం బొనరించిన మీకు బ్రతిచేయనోపనిదే కృతజ్ఞతాసూచకముగా వందనం బొనరించెదనని యతని పాదములంబడిన రాముండును లేవనెత్తి యత్తరుణి నోదార్చుచు దన యుదంత మెఱింగించి మరల నత్తరుణివృత్తాంత మడిగిన నది యిట్లని చెప్పం దొడంగెను.

ఆర్యా! నేను కుంతలదేశాధీశ్వరుడగు శ్రుతకీర్తియను రాజు కూతురును. నాపేరు కనకప్రభ, నాకు బ్రాయము వచ్చినది మొదలు నన్ను వరించుటకు బెక్కండ్రు రాజపుత్రులు వచ్చిరికాని నా సమ్మతిలేక నా తండ్రి నన్నెవరికి నియ్యక స్వయంవరము బాటించిన నందు వచ్చిన నృపనందనుల సుందరము నాకు సరిపడమిని నెవ్వని వరింపక యూరక మరల నంతఃపురమున కేగితిని. ఆ యీర్ష మనమున నిడుకొని యే రాజకుమారుడు ప్రోత్సాహపరచెనో కాని మొన్నటిరాత్రి మాయింట నంతఃపురమున నిద్రాపరవశనై యున్న నన్ను గన్నమువైచి యీ దొంగలు దీసికొనివచ్చిరి. నాకు నడవిలో మెలకువ వచ్చినది . చేయునదిలేక యూరక యేడ్చుచుండ నిన్నటి రాత్రి కాతస్కరు లీగుడిలోనికి దీసికొనివచ్చిరి. పైననేమి జరిగెనో దుఃఖమున నొడలెరుంగమి నాకు దెలిసినది కాదు.

అట్టి దుర్మార్గుల జంపి నాకు ప్రాణదానము జేసితిరి. దైవ మీయాపన్మూలమున మీదర్శనము నాకు గలుగజేసెను. నే నిదివర కింతచక్కనిపూరుషు నెప్పుడును జూడలేదు. ఈ శరీరము మీ యధీనమైనది. నన్ను బెండ్లియాడి కృతార్థురాలినిం