పుట:కాశీమజిలీకథలు -01.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

75

ఇంతలో నాదంపతులు సమీపించి జనరహితమగు నాప్రదేశమున మానిసి గానంబడిన, సజాతీయవస్తుదర్శనసంతోషంబు మనంబున వెల్లివిరియ నల్లన దానితో నిట్లనిరి.

అమ్మా! నీ వెవ్వరవు! ఇందేల వచ్చితివి? నీయభిదాన మెద్ది? ఇట్లు కుంద గారణ మేమి? ని న్నెవ్వ రిట్లు భంగపరచిరి? నీవెతలతెరం గెరింగించిన మాయోపినంత యుపకారము సేయుదుము. నిక్కము వక్కాణింపుమని స్వాంతనపూర్వకముగా నడిగిన నాదుష్టురా లొక్కింత తలయెత్తి వారల చక్కదనమునకు మిక్కిలి వెరగుపడి మరియు నా నెలతం దిలకించి, ఔరా! ఈ మోహనాంగి నిర్జరాంగనగాని మానవకాంత గాదు. మానిసుల కిట్టి యందము గలుగునా. వంగదేశాధీశుని మరులుకొలిపిన మదవతియు నిదియే. అతని యొద్దనున్న కంకణమునకు జోడైనది దీని దాపలకేల నున్నది. ఔనా, నతం డిట్టి రమణీమణికై విరహమొందుట యుచితమే. నా భాగ్యవశంబున నేటి కెన్నుకొన్న యన్నువ కన్నులం బడినది. దీని నెట్లో మాయచేసికొని పోయెద. అర్ధరాజ్యంబు నాకు దక్కినదని సంతసించుచు నమ్మురిపెము మొగమున దోపనీయక వారి పాదంబులంబడి యిట్లనియె.

అయ్యో! నాకుయ్యేమని వక్కాణింతు, అయ్యయు, నమ్మయువలె మీ రాదరంబున నడుగ నుడువకుని సాధుపరిపాటిగాదు. నాకు లేకలేక యొకకొడుకు గలిగెను. వాడు పుట్టినవేళ యెట్టిదో కాని జాతకర్మాదిక్రియలు నిర్వర్తింపకమున్న తండ్రి నాకలోకం బలంకరించెను. ఆడుదాననైనను నేను ధైర్యము గలదానను గాన భయపడక యెద్దడికోర్చి పిల్లవాని నత్యంతమోహంబునం బెంచి పెద్దవానిజేసి తద్దయు శ్రమపడి బెక్కురొక్కంబు వ్యయపుచ్చి యొకపడుచుం గట్టిపెట్టితిని. ఆ దుర్మార్గు డది కాపురమునకు వచ్చినది మొదలు నాయందుగల భయభక్తులు నానాటికి నీటగలుపుచుండెను. వాని భార్యయు ననార్యకులసంజాతయగుట నాపై మిగుల నీసుగలిగి మగని ననుదినము రోస మెక్కించుచుండును కొడుకు చెడుగైన గోడలు మంచిదగునా?

ఇట్లుండ నొక్కనా డాకోడలు రాకాసి యేమి బోధించెనో యా నిర్భాగ్యు డూరక నాపైబడి చావమోది తలమట్టి యీడ్చి చావుమని సముద్రంబునం బడద్రొబ్బిన మునింగితిని గాని పాపపు పరమేష్ఠి నా కాయువెక్కడ బెట్టెనో చావక యలలం దారువువోలె దేలి యీ రేవునకు గొట్టుకొనివచ్చి గట్టెక్కితి. "పాపీ చిరాయు" వను మాట తప్పునా? మరియు నన్నింక నెన్ని చిక్కుల బెట్టదలచియో దైవము సముద్రంబునం బడినను చావనీయక తేలవైచె. కటకటా! నావంటి పాపాత్మురా లీమూడులోకముల లేదుసుమీ యని యేడ్చుచున్న యన్నాతిం జూచి జూలిపడి వసంతుఁ డిట్లనియె.