పుట:కాశీమజిలీకథలు -01.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వింతయగు కంకణము ధరించు నించుబోడి యెంత వన్నెలాడియోగదా! యే దేశం బలంకరించెనో? దాని భార్యగా బడసిన మగవాడు పూర్వజన్మమున నెంత తపము గావించెనో యని పెక్కుగతుల దానిమూలముగా దద్వస్తుధారిణియగు నారీమణిం బొగడి విరాళిందూలి యట్టి కంకణము ధరించిన కోకస్తని యీలోకములోనిదేగదా. దాని దీసికొనివచ్చి నా కిచ్చినవారికి నాయర్ధరాజ్యం బిచ్చెదనని యప్పుడ ప్రచురపత్రికల వ్రాయించి దేశదేశంబుల వ్యాపింపజేసెను. వానిం జూచినవారెల్ల రాజ్యకాంక్షం గొఁత చింతించిరి గాని యన్వయదేశగోత్రనామంబులు వివరింపమిం జేసి యట్టి యాసల మరలించుకొనిరి.

ఒక్కనా డయ్యూరనున్న వృద్ధభూసురకాంత యావృత్తాంతము విని సంతసముతో నాభూకాంతుని యంతికమున కరిగి యతనివలన జాలరివాడు వలవైచినప్రదేశపుగురుతును కంకణము పోలికయు దెలిసికొని యతనితో నిట్లనియె.

దేవా! నేను దేవరవారు గోరిన నారీమణిం దీసికొని వచ్చెదను. దీనికై చింతింపకుడు. అక్కాంత మీప్రక్క నున్నదిగా భావింపుడు. సకలసాధనసమన్వితంబును విచిత్రవస్తుభూయిష్ఠంబును నగు నొకయోడ నా కిప్పింపు డిప్పుడ యరిగెదనని యడిగిన నతండు సంతసించి యది కోరిన వన్నియు నిచ్చి యంపెను. పిమ్మట నాబడుగుపడతియు నాయోడకు నేలికయై యెక్కి మంచివేళ లంగరులు తీయించి చాపలెత్తించి పల్లెవానికి జేప దొరికిన దిక్కు ననుసరించి యోడ నడిపింపసాగెను.

ఓడ నడచునప్పుడు సముద్రతీరధారుణియంతయు బరీక్షింపుచు నా వృద్ధ పదియేనుదినములు పయనము సాగించెను. పదియారవదినమున సూర్యోదయము కాగనే యొడ్డున గొప్పపొగయు, దానిలోనుండి మంటయు, నవి యన్నియు నడంగిన వెనుక నున్నతములైన మేడలుం గాన్పించినవి.

వానిం జూచి యమ్ముసలిది మిగుల సంతసించి యోడ సరదారులతో నోడ లంగరు వేయుడనియు మరల దాను వచ్చుదనుక గనిపెట్టుకొని యక్కడనే యుండవలయుననియు నాజ్ఞాపించి చింపిరిగుడ్డల గట్టుకొని చిన్నదోనెయొకటి యెక్కి చిరుకోలం ద్రోసికొని యుప్పట్టణపురేవు చేరినది.

మొదట నందెవ్వరిం గానక చింతాకులమానసయై గట్టుపై కెక్కి నలుదెసలం బరికింపుచుండ నొకదండనుండి యిరువురు వచ్చుట గానంబడియె. వారు దానిపుణ్యవశమున నాటి యుదయమున విహారార్థము వెడలిన వసంతుడును కళావతియే. అట్టి వారిం జూచినతోడనే వేడుకతో నాప్రోడ మరల సముద్రతీరమున గూర్చుండి తల విరయబోసికొని గోలుగోలున నేడ్వసాగెను.