పుట:కాశీమజిలీకథలు -01.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

73

నాథా! మున్నొకసారి యద్దానవి దేవలోకంబున కరిగి యం దాకాశగంగలో నగలును బుట్టంబులును గట్టున బెట్టి రంభాదిదేవకాంతలు జలకేళిం దేలుచుండ నాదండనుండి రంభదియో యూర్వశిదియో మేనకదియో కాని యనర్ఘరత్నరుచులు వెలుగుచున్న కంకణములజత యొకటి దొంగిలించి తెచ్చి నా కిచ్చినది. అదియు నా చేతులకు గొల్చునట్లు సరిపడి యపూర్వతేజం బొనగూర్చినది. నాకున్న వస్తువులన్నిటికన్న దానియం దెక్కున మక్కువ గల్గుటచే నొకప్పుడైనను విడువక దాల్చియుందును.

నేడు మున్నీటితరగలరాయిడి నం దొక్కకడియము జలంబులం బడి మునిగిపోయినది. దానికై వెదకుచుంటిని. ఇది యగాధప్రాంతమగుట దొరకు ననునాస వదలినది. దాని తోడికడియ మిదిగో యెంత చక్కగా నున్నదో చూడుడు. అని తన చేతనున్న రెండవకడియము విడదీసి చూపించిన జూచి వెరగుపడి యతం డోహో! ఇది దేవతాభూషణము గాన నిట్లున్నది. మానవుల యలంకారముల కింత వింత సొబగుండదు. దేవతల నగలన్నియు నీ రీతినే యుండుసు గాబోలు. ఆహాహా! వారి భోగభాగ్యములు! దానికై నీవిక యూరక శ్రమపడకుము. నేర్పరియగు కంసాలి నాకు మిత్రుడొకడు గలడు. వానిచే నిది పోలిక యిచ్చి రెండవది చేయించెదనని తత్కాలోచితవాక్యములచే నామెకు దానియందుగల కోరిక యుడిగించి యత్తరుణీమణి కేలువట్టి మరల కోటలోనికిం దీసికొనిపోయెను.

అంతలో దనమిత్రుల వృత్తాంతము జ్ఞాపకమువచ్చుటయు నట కరుగు సంకల్ప మంకురించినది కాని యక్కోటలోని భవంతుల వింతసొబగెంతయు నతనిస్వాంతమున కడ్డుబడి సాగనిచ్చినదిగాదు. దాన నమ్మానవనాథసూనుం డమ్మానవతిశిరోమణితో నందు గొన్నిదినంబులు స్వేచ్ఛావిహారంబుల గ్రీడింపుచుండెను.

గోపా! అట్లు సముద్రంబునంబడిన యప్పంకజాక్షి కంకణం బొకమత్స్యంబు జాతిస్వబావంబున మ్రింగి క్రుమ్మరుచుండ దాని నొకజాలరి జాలంబునం బట్టి పైకిదీసి యందపూర్వతేజంబున వెలుంగు పెనుమీనంగాంచి దానిమేని యందంబునకు వెరగందుచు దాను దివినచో నొకటి రెండు పూటల యాహారమున నెక్కుడు చాలదనియు నొకఱేనికి గానుకగా నిచ్చిన నచ్చెరువంది యెద్దియేని బహుమాన మిచ్చుననియు నిశ్చయించి కోయక యబ్బోయ ప్రాంతముననున్న వంగదేశాధీశుడగు కందర్పకేతుండను రాజునొద్ద కరిగి తనకడనున్న యవ్వింతచేప నర్పించెను.

ఆ చేపం జూచి యతండును మిగుల నాశ్చర్యపడుచు నప్పల్లెవానికి దగిన పారితోషికంబిచ్చి యంపి యప్పుడది బానిస కత్తిచే దగ్గిరయుండి కోయించి యందు వెలుంగు నపూర్వమణివలయము జూచి చేతంబూని యిటునటు త్రిప్పుచు నాహా! ఇంత