పుట:కాశీమజిలీకథలు -01.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

71

చూచి యోహో! ఇది నాజేబులోని కెట్లు వచ్చినది? దీనికి సరిపడునేమో చూతమని యది యందు దగిలించిన యమరుటయు సంతసించి యటునిటు త్రిప్పిన బీగము వచ్చినది. దాని కచ్చెరువందుచు దైవమే తన కీసహాయము జేసెనని పెక్కువందనములు గావించుచు నమ్మార్గంబున బాతాళగృహంబు సొచ్చెను.

గోపాలా! విను మత్తాళముచెవి యా రక్కసి తన కావృత్తాంత మెఱింగించి యరిగిన పిదప గళావతి పరీక్షార్థమై దాని నప్పేటికలోనుండి పైకిదీసి చూచి మరల దాని నందుంచ నశ్రద్ధగలిగి మంచముమీదనున్న మగని చొక్కాజేబులో వైచిన నా యంగీ నత డుదయమున వచ్చునప్పుడు దొడగికొనెను గాన దాన నది తీయగలిగె లేనిచో నిష్కారణ మతండే మడియవలసి వచ్చును.

వసంతు డట్లు పాతాళగృహము ప్రవేశించి మణికాంతులచే బట్టపగలువలె నొప్పుచున్న యచ్చోట నలుదిక్కుల వెదకి మంటపములో వ్రేలగట్టియున్న పంజరము జేరంజని తలుపు దెరచి చిలుకం బట్టునంతలో దెలిసికొని యప్పలాశిని దిశలధ్రువ నార్చుచు నొక్కపరుగున వచ్చెను. గాని మొదట నతడు చిలుకకాళ్ళను రెండును విరచెను. గాన నది చెరువుగట్టున కాళ్ళు విరిగి పడియెను.

పదంపడి దాని రెక్కలు కంఠమును నులిమి పారవైచిన నదియు నయ్యవయవములు విరుగనార్చుచు గిలగిల దన్నుగొనుచు బ్రాణంబులం బాసెను. ఆహా! పెద్ద జాలమునుండి గాలుండువోలె జీవజాలంబుల సమయించుచు నస్తోకగర్వోద్రేకమ్ముల నా రేద్రిమ్మరి కతనిచేతిలో చావు విధించె గాబోలు. అట్టి దుష్టురాలిం గొట్టిన యతని సుకృతము సురలు సైతము గొనియాడిరి. అ ట్లాఘోరదానవిం దునిమి యతం డత్తటాకంబున నొడలు గడుగుకొని యత్తెరం గాయంగన కెరింగింప నతిత్వరితగతి జనుదెంచెను.

అంతకుమున్ను యన్నెలంతయు మానవాంతకురాలి యార్పులు విని యోహో! ఇది యేమి నాతల్లి యకాలమున వచ్చుచున్నది? విపరీతం బెద్ది బుట్టదుగదా! నా మనోహరురు డొంటిగా నడవి కరిగెనే! యతని యునికి విని వచ్చెనా! ఏమి మోసము గావించునో గదా యనుచు మరికొంతతరి కయ్యడలు వినరామికి వెడద దడబడ దాను మున్ను దీసిన తాళపుచెవిని వెదకి కాన కయ్యో! నానెయ్యంపుజనని బ్రతుకేమయ్యెనో గదా! అకటా! నన్ను బుత్రికయని నమ్మి నాకు దనమరుపు మరుగుతెరం గెరింగించె! నేనును నామగనికపటం బెరుంగక స్త్రీచాపల్యంబున దాచలేమి నాగుట్టు చెప్పితిని. దాని కేమి మోసము గావించెనో గదా యని కన్నీరుమున్నీరుగా బెక్కుగతుల చింతింపుచుండెను.