పుట:కాశీమజిలీకథలు -01.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యున్నది. అబ్బొదినున్న యనటులన్నియు జెలగినచో నడుమ నొకయినుపకవాటంబు జూపట్టు దాని బీగము నీవు పరుండు పర్యంకపేటికయం దున్నది. దాన నత్తలుపు దెరచినచో బ్రశస్తభిత్తికాఘటితనవరత్నప్రధానిరస్తతమస్సమూహంబగు పాతాళగేహంబొకటి పటికంబురాలసోపానములతో గాననగు అందు సుందరమణిస్థంభసంభావితంబగు మంటపంబున వ్రేలంగట్టియున్న పసిడిపంజరములో బంచవర్ణములచిలుక యొకటి గలదు. నాయాయుర్దాయము దానిలో నున్నది. దాని కేమైన బ్రమాదము సంభవించినచో నాకు బ్రాణహాని యగుంగాని వేరొండుమార్గంబున మృత్యువు రానేరదు. ఈరహస్యంబు చతురాస్యుండైన నెఱుంగడు. నాకు బుత్రికవు గాన నెఱింగించితిని.

ఇప్పుడైన నాకు వేరొండుచోట మరణంబు లేదని నమ్మకము కలిగినదా యని తన జీవితరహస్యవృత్తాంతమంతయు నెరింగించిన, సంతసించి యా యించుబోడి యిట్లనియె. అమ్మా! నేటికి నా మనంబు సమ్మోదంబండినది. మున్ను గలిగిన యద టుడిగి నీ వింక జమునికడ కరిగినను భయములేదని యానందమందుచున్న కూతు బెక్కుతెరంగుల గారవించె నింతలో దెల్లవారుటయు నా నిశాటిని కోటదాటి యెక్కడకేనిం బోయినది.

అంత నన్నెలంతయు సంతసముతో దనకాంతుని గోదిత్వంబువాయ బోధించి యభ్యంగనాభ్యవిహారాలంకారాది వ్యాపారముల దీర్చిన వెనుక నొకకనకమణిగణప్రభాసితంబగు సభాంతరమున గూర్చుండియున్నయవసరంబున నయ్యంబుజాక్షి తన కారక్కసి చెప్పినవృత్తాంతమంతయు నింతయేని గొరంతపుచ్చక పూసగ్రుచ్చినరీతి వాక్రుచ్చిన నచ్చెరువందుచు మందహాసంబున వదనం బలంకరింప వసంతుం డంతరంగంబున బెక్కుతెరంగుల నాలోచించుచు దనకపటం బాబోటికి దేటపడనీక మఱునా డుదయంబున లేచి భార్య కెద్దియో మిష జెప్పి మాటుకవాటంబుదారి నక్కోట దాటి యుత్తరంబుగా నరిగిన గనకపద్మమనోహరంబగు సరోవరంబు గాన్పించినది.

అందు గ్రుంకి ముమ్మారు వలకొనినపిదప గనంబడిన కదళీవనంబు జొచ్చి యెట్టకేలకు వెదకి యప్పెనుబొదిం గనుగొని కటారిధార నేకవారంబున దాని నిర్మూలంబు గావించి యయ్యినుపకవాటమును జూచెను. దాని బీగము దెచ్చుట మరలి వచ్చెనుగాన నత్యంత చింతాక్రాంతస్వాంతుడై యోహో! యిప్పుడేమి మోసము రాబోవునో గదా! తాళము మరచివచ్చితిని. మరల నింటి కరిగినచో నాలస్యమగును ఆరక్కసి కీపాటి కొంత పొడకట్టక మానదు. అది వచ్చినచో నన్ను బరిమార్చును.

ఏమి చేయుదునని పెక్కుతెరంగుల జింతించుచు నలవాటు చొప్పున దనచొక్కాయిజేబులో జేయిడిన దాళముచెవి యొకటి చేతికి దగిలినది. అది పైకి తీసి