పుట:కాశీమజిలీకథలు -01.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

69

ఎప్పుడును నా మానసం బలర బెక్కులు పలుకుచుండు నీవు నే డిట్లు కన్నీరు విడుచుచుండుటకు నాచిత్తము తత్తరపడుచున్నది. వేగ నెఱింగింపుమని యారక్కసి పెక్కుతెరంగుల బ్రతిమాలిన నెట్టకేల కయ్యెలనాగ యిట్లనియె.

అమ్మా! నే జింతించుటకు నీ వడిగినదానిలో నొకటియు గారణముగాదు. వినుము. నీవు పెక్కుదేశంబు లరిగి ఘోరకృత్యముల గావింపుచుండ మాంత్రికులు గాని, తాంత్రికులు గాని, పరాక్రమవంతులు గాని నీ కెద్దియేని కీడు గావించినచో నే నేమి చేయుదును? నాదేహ మీయడవిమృగములకు బలియియ్యవలసి వచ్చునుగదా? నీ వరిగినది మొదలు వచ్చుదనుక నా దెసం బరికించుచు వొంటిగా నెన్నినా ళ్ళీయడవిలో వసింపుదును? నీవు రానినాడు నాప్రాణంబులు నిలుచునా! నన్ను గాపాడువా రెవ్వరు? ఇదివరకు జేసిన హింసయు సంపాదించిన విత్తంబును చాలదా? ఊర కేల గ్రుమ్మరియెద వెల్లదినముల నాకడ నుండిన నుండుము. కానిచో నన్నుగూడ భక్షించి యేగు మిదియ మదీయిచింతాప్రకార మని పలికిన విని నవ్వి యవ్వికటముఖి యవ్వనజముఖితో విట్లనియె.

ఓహో! “నెలతా! ఇదియా నీ చింత? చాలు చాలు యీపాటి కూరకుండుము. నన్ను జంపువా డీమూడులోకంబులను లేడు. నే నెక్కడి కరిగినను నా యాయుర్దాయము గోప్యముగా నిక్కడనే యున్నది. ఆ మర్మమెరింగినవాడు గాని నన్ను జంపలేడు. దానిం దెలిసికొన బ్రహ్మవశముగాదు . నేను బ్రతికియుండగా నీకొక యాపద రావిత్తునే! దీనికయి చింతించకుము. నిశాటుల కెల్లకాల మొకచోట నుండుట కులపరిపాటి గాదని బలికిన విని మరల నబ్బోటి యిట్లనియె.

అమ్మా! నీ యాయుర్దాయము గోప్యముగా నున్నదని యన్నంతమాత్రముననే నాకు సమ్మోదంబుగాలేదు. అమ్మరుంగుతెరం గెఱింగినపిమ్మట సరిపడెనని తోచినచో మురిపె మందెదనని తనకు మగడు బోధించినరీతిగా బలికిన నారక్కసి యక్కపటం బెరుగక చెక్కిలి ముద్దిడుకొని కన్నీరు దుడుచుచు నప్పడుచుతో నిట్లనియె.

తన్వీ! అట్లైన నిను, మివ్విజననగరమున కుత్తరంబున నవరత్నసోపానమండితంబున, కనత్కనకవనజకుముదకైరవకల్హారకమనీయపరిమిళితామృతోపమానజలరతంబునై యొప్పు తటాకంబు గలదు. అక్కమలాకరంబున స్నానంబు జేసి దాని ముమ్మారు వలగొని పడమరదెస జూడ నపూర్వమైన కదళీవనం బొండు గాన్పించును. అం దొక్కొక్కబొదికి నూరేసి కప్పురపుటనటులు మనోహరఫలదళవిలసితములయి పెక్కుదినుసులుగా బొడసూపును. దాని నడుమ వింతలగు నాకులను ఫలముల గ్రిక్కిరిసియున్న గెలలును గలిగిన బొదియొకటి కొమరు మిగిలి