పుట:కాశీమజిలీకథలు -01.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రాకాసి వచ్చుదినంబు దక్క తక్కినదివసంబులనెల్ల నసమశరీరక్రీడల నీడులేని వేడుకతో గడుపుచుండిరి. ఒక్కనా డవ్వేడుకకా డాచేడియతో నిట్లనియె.

అంగనామణీ! మన మీతెఱంగున మఱుంగువడి యియ్యడవినడుమ పాముపడగనీడనున్న భేకంబువలె నీరేద్రిమ్మరి రాయిడి కడలుచు నెంతకాల ముండవలయును. ఎప్పుడో యిది యాకలిగొని యున్నప్పుడు తెప్పున నిన్నుగూడ భక్షింపక మానదు. క్రూరుల నమ్మవచ్చునా? మన మిన్నిశాచారిణిబారి దప్పించుకొని జనపదంబున కఱిగి స్వేచ్ఛావిహారంబుల సుఖింపరాదే యనుటయుం గటకటంబడి యక్కుటిలాలక మగనితో నిట్లనియె.

అయ్యో! మీ రయ్యసురాంగన పరాక్రమం బెఱిగినచో నట్లనక పోదురుగదా? విను డది మన మెందేగినను దెలిసికొని యొకయడుగున వచ్చి యిరువుర గబళములుగా జేసికొనక మానదు. వారంబున కొక్కరేయిగదా మనకు హాయి తప్పియున్నది. ఊరక యిట్టి సుఖం బేల నేలపాలు గావింపవలయును? ఇంతకన్న జనపదంబుల నేమి వింత లున్నవి? కావున నిట్టి యాలోచన మాని తద్దయుం బ్రీతి నెల్లప్రొద్దుల నాతో నిందు గ్రీడింపుడని పలికిన ముద్దరాలిం బెద్దతడవు బిగియ గౌగిలించుకొని యద్దూరదర్శి దద్దిష్టానుసారముగా మెలగుచు మరికొన్నిదినము లరిగిన వెనుక నొకనా డాచేడియతో నిట్లనియె.

కాంతా! నే డొకయేకాంతంబు గలదది యిట్లట్లని శంకసేయక నా చెప్పినట్టు జేయుదునని నాచేత జే యిడుదువేని నీకు వాక్రుచ్చెదననిన నవ్వనితయు నప్పుడు నాథా! యట్లే కావింతు జెప్పుడని యత్యాతురముతో బ్రతిమాలిన నతండును తా నాలోచించినరీతియంతయు నాతలోదరికి బోధించి యీరేయి నట్టడుగుమని ప్రేరేపించిన నయ్యించుబోడియు దానికారణ మెఱుగనేరక యడుగవలదని మున్ను చెప్పియున్నవాడు గావున మరుమాట పలుకక వల్లెయని మునువోలె వల్లభుని బల్లిం గావించి గోడ నత్తించి యానక్తంచరి వచ్చుదెస బరికించుచుండ నింతలో దానినూర్పులు చెవింబడుటయు నెదురేగి యుపచారపూర్వకముగా తోడ్తెచ్చి భోజనంబు గావించిన వెనుక దానిచరణంబు లొత్తుచు దలవంచుకొనిని యెద్దియో తలంచుకొని పయ్యెట దడువ గన్నీరుగార్చుచు జింతింపదొడంగిని జూచి యోర్వజాలక యపూర్వదేవాంగన యిట్లనియె.

వాల్గంటీ! నేనింట లేనప్పుడు నిన్నొంటిగా నుంటజూచి బంటుతనంబున నెవ్వరేని యవమానంబు గావించిరేమో చెప్పుము. ఇప్పుడ యప్పాపాత్ములయొడ లడవిమృగములపాలు గావించెద లేక నీ కెద్దియేనిం గావలసియున్న వస్తు వెఱింగింపు మది త్రిలోకంబుల నెందున్నను దృటిలో నీముందు దెచ్చిపెట్టెద. వే రెద్దియేనికారణ మున్నచో నుడువు మూరక నాడెందం బాందోళనము నొంద నిట్లు కుందెద వేమిటికి!