పుట:కాశీమజిలీకథలు -01.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

67

లను జలయంత్రవర్ధితకుసుమకిసలయదళవిలసితములయిన తావుల వెదజల్లు పూవుందోటలను విహరింపుచు స్వర్గసౌఖ్యంబుల మాటుపరచు కోటలో నమ్మేటిబోటితో నంగజవిద్యాపాటవంబు దేటవడ నేడుదివసంబు లొక్కగడియగా గడిపిన నయ్యతివయు నతని చతురతను మెచ్చుకొనుచు నారక్కసి వచ్చుసమయం బాసన్నం బగుటయు నతనితో నిట్లనియె.

నాథా! నేడు దిననాథుం డపరిగిరిశిఖరంబు నధిరోహించినతోడనే వేడుకతో నిక్కడ కద్దానవి యేతెంచెడిని? నీయునికి వినినచో నొడల నసువులు సడలజేయక మానదు.

దాన బెక్కుగతులగొనలు సాగుమన యుత్సాహంబంతయు నుత్పన్నం బయ్యెడుం గదా? కావున నారక్కసి యిక్కడనుండి యరుగుదనుక ని న్నొకగృహగోధికం జేసి భిత్తినత్తించెదను. అప్పాటవంబు అన్నిశాటినివలనం దెలిసికొనినదే. అంతదనుక సైరింపుమని పలికి యక్కలికి యట్లు కావించినది. ఇంతలో బ్రహ్మాండకరండంబు పగుల నార్చుచు నారాకాసి యాకాశమార్గంబున నేతెంచిన నమ్మదవతి యెదురేగి పదములంబడిన నదియు నప్పడతి జడుపుడిపి లేవనెత్తి ముద్దిడుకొని పెక్కుగతుల గారవించెను. మఱియు భోజనంబైన వెనుక తన కవ్వనిత చరణంబు లొత్తుచుండ పెనుపాన్పున బండుకొని తాను జూచివచ్చిన వింతలన్నియు నక్కన్నె కెఱింగింపుచు నలుదెసలం బరికించి యల్లన నిట్లనియె.

బోటీ! నేడు మన లోగిటలో మానిసవాసిన వైచుచున్న దేమి? లాతివార లెవ్వరేని రాలేదుగదా! వచ్చిన వాక్రువ్వు మాక్రూరుల క్రొవ్వుడిగింతు ననుటయు గపటంబున నక్కుటిలాలక యిట్లనియె.

అమ్మా! యీ నట్టడవిలోని కెట్లు మానవులు వత్తురనుకొంటివి. వచ్చినను గుట్టుదెలిసి కోటలోనికి రాగలరా? నేను మాత్రము మానిసినిగానా? నా కంపు నీకు బెట్టగింపుగాదా? నన్ను బరిమార్చినం పరిమార్పు మింతకన్న వింతవారు లేరనుటయు నా మాటల సయిరింపక పశ్చాత్తాపచిత్తమై కూతు నోదార్చి రాత్రిశేషం బెద్దియో గొడవతో గడిపి తెల్లవారినతోడనే యాపువ్వుబోడిం దీవించి యారక్కసి యెక్కడికేనిం బోయినది.

పిమ్మట నా కొమ్మయు సంతసముతో జలకమాడి సింగారించుకొని మరల వసంతుని బురుషునిగా జేసి పన్నీట జలకమార్చి మధురపదార్థంబుల నాకలి దీర్చిన నప్పురుషుండు రాత్రియుం బగలను వివక్షతలేక నేకరీతి శంబరారాతికేళుల నానాతిని సంతోషపరచెను. వారి కవ్వార మొకనిముషమైనం గాలేదు. ఆహా! కామప్రలాపంబు యుగాంతంబులు గడచినను అట్లే యుండునుగదా? విను మట్లయ్యిరువు రా