పుట:కాశీమజిలీకథలు -01.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దండ్రుల మరచి నేనింతదాననై తిని. దానినే తల్లియని నమ్మియుంటిని. మాయమ్మయు వారంబున కొకసారి వచ్చి రాత్రుల నాకు బెక్కువిద్యలం గరపుచు విదేశంబుల జరుగు వింతలగు వృత్తాంతముల నెఱింగించుచు నిట్టి యరణ్యంబున నున్నను లోకపరిపాటి యంతయు నాకు జూచినదానికన్న నెక్కుడుగా తెలియజేసినది.

దానం జేసియే సుమా! నే నింతకుమున్న పురుషుల నెరుగకున్నను మిమ్ము గన్నతోడ మర్యాదగల పురుషరత్నమని యూహించితి. ఈరక్కసి లోకంబున నెక్కడే వింతయగు వస్తువున్నను నాకు దెచ్చి యిచ్చుచుండును. మా కోటలోనున్న విచిత్రవస్తువులు నాకలోకంబులో సైతము లేవని చెప్పగలను. మాయమ్మయు నిన్ననే దేశాటనమునకై యరిగినది. మరియు నేడుదినముందనుక రా దిదియ మదీయవృత్తాంతము. నేడు మద్భాగ్యవశంబున మిమ్ముల బొడగంటినని పల్కుచు విభ్రమవిలోకనంబు లతని వదనపద్మంబునం బరగించిన నిండువిల్కాడు పూముల్కుల జురుకుచురుకున నెడద నాటనేయుటయు నాపురుషసింహు మోహ మాపనేరక యమ్మగువను బిగియార గౌగిలించుకొని చెక్కిలి ముద్దిడుకొని నవ్వనితయు దత్తదనుగుణ్యవృత్తుల మెలంగుచు జిత్తంబిచ్చినది.

పిమ్మట నక్కనకాంగి యప్పురుషపుంగవు నభ్యంగనమార్చి తన సూదవిద్యాపాటవంబు తేటపడ నతివిచిత్రములైన పిండివంటలతో రుచిసంపన్నంబైన యన్నంబు బెట్టినది. భోజనంబైన పిదప నయ్యిరువురు నొకవిహారమందిరంబునం గూర్చుండి కప్పురపు వీడియము వైచుకొనుచు గొంతదనుక నిష్ఠాగోష్ఠిం బ్రొద్దుపుచ్చిరి. మఱియు నత్తరుణియు విపంచి ధరియించి పాణికంకణఝణక్కారంబు లెసంగ సప్తస్వరంబు లనురాగంబు బెరుగ బెక్కురాగంబులను జంత్రస్వరములతో గంఠనాదంబు మేలగించి రాల్గరగునట్టు గాంధర్వంబు వెలయించిన నగ్గానంబున మానసంబు నీరుగాగ నన్నరనాథసూను డోహో యని యచ్చెరువందుచు నా పల్లవపాణిని మఱియు మఱియు గౌగలించుకొని ముద్దుబెట్టుకొనుచు బెక్కుతెరంగుల నన్నాతిమానసము గఱుగజేసెను. ఇట్లయ్యిరువురకు మదనుండు సమానుండై యున్నకతంబున వారు బెద్దయుం బ్రొద్దు నొడలెఱుంగని కామావృత్తులం దగిటి విచిత్రబంధంబుల రతికేళిం దేలిరి.

చ॥ పొడమిన నాటనుండియును . బూరుషు పోలికయే యెఱుంగ క
      య్యడవి వసించి లోక విష • యంబుల నేమియు జూడనట్టి య
      ప్పడతి వసంతుని న్సకల , బంధముల న్సమకేళి దన్పె నే
      ర్పడ సహజంబుగాదె రతి , పాటవ మారయ నాడువారికిన్.

మఱియు ననేకవిచిత్రములైన సౌధములను, నవరత్నశోభావిభ్రాజమానంబగు సభాభవనంబులను బహువిధఫలతరుషండమండితములయిన యుద్యానవనము