పుట:కాశీమజిలీకథలు -01.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

65

అట్లు లేచి యెదురు మదనసుకుమారుండగు నారాజకుమారుం గాంచి యా యించుబోడి మేను బులకింప విభ్రాంతస్వాంతయై యొక్కింతసే పేమియుం బలుక నేరక, ఏమీ? యిది నాకు స్వప్నమా? కాదు. జాగ్రదవస్థగానే యున్నది. ఈగృహంబున నున్న వస్తుజాలంబులన్నియు బ్రత్యక్షముగా జూచుచుంటినే? ఇదిగో నాకన్నులు తెరువబడియే యున్నవి. ఈ యేకాంతప్రదేశమునకు వసంతుంబోలిన యీ పురుషరత్నం బెట్టువచ్చెనో! మదీయభాగ్యదేవత యిట్లు పుత్తెంచెనేమో యరసెదంగాక యని యెట్టకేలకు బికస్వరంబున నతనితో నిట్లనియె.

ఓ మదవతీమదనా! నీవదనంబు జూడ మిగుల సుకుమారవంతుడువుగా గాన్పించుచుంటివి. నీ విక్కాతారంబున నేకాంతముగానున్న యీరాక్షసశుద్ధాంతమున కెట్లు వచ్చితివి? నివాసదేశంలబెద్ది? భవదీయనామాలంకృతంబులైన వర్ణంబుల వివరించి కర్ణానందం బాపాదింపుము. మద్దత్తంబగు నాతిథ్యం బంగీకరించి నన్ను కృతార్ధురాలిం గావింపుమని వినయంబున బ్రార్థించిన దదీయమృదుమధురమనోహరవికస్వరవచనరచనకు బరవశుండై యారాజనందనుం డొక్కింతతడవున కొడలెఱింగి యయ్యంగనామణికి దనవృత్తాంతంబంతయు నెఱింగించి మఱియు నిట్లనియె.

యువతీ! భవదీయకులశీలనామంబు లెఱింగినపిమ్మటగాని యేతదాతిథ్యం బంగీకరింపరాదు. ఇయ్యడవినడుమ నీయంతిపురంబునకు వన్నె యిడుచు నొంటిగా నీ వుండుటకు గతం బేమి? నిన్ను గన్న తల్లిదండ్రు లెవ్వరు? నిన్ను భార్యగా బడసిన ధన్యుని యభిదాన మెద్ది? ఇది రాక్షసశుద్దాంత మంటివి. ఆరాక్షసుం డెవ్వడు? ఇవ్విజననగర మెవ్వరిది? నీవు వనదేవతవని తోచుచున్నది. యదార్థము వక్కాణింపుమని యడిగిన సంతసించి యప్పడతి యిట్లనియె.

ఓ మహారాజకుమారా! మదీయవృత్తాంతం బాకర్ణింపుము. నా పేరు కళావతి. ఇవ్విజననగర మొకబ్రహ్మరాక్షసిచే బాలింపబడుచున్నది. ఆరాకాసి యనేకదేశంబులనుండి దోచికొనివచ్చిన సొమ్మంతయు నీనిశాంతముల నుంచి బీగము వైచుచుండును. మరియు వారంబున కొకసారి వచ్చి యిచ్చట మేడనొకటి గట్టి తెచ్చిన విత్తం బం దుంచి ముద్రలు వైచి యేగుచుండును. ఈసౌధంబు లన్నియు నట్లు కట్టినవే. అది యొకనాడు దేశాటంబునకై వెడలి నా జన్మభూమియైన యవంతిదేశంబునం బడి మహామారియుంబోలె యందలి ప్రజల గసిమెసంగ తదీయదేశపాలకులగు మదీయజననీజనకుల కృపలేక నాకలోకంబున కనిపి రెండేండ్లప్రాయంబు గలిగి బంగరుతొట్టె నిట్టట్టు కొట్టుకొనుచున్న నన్నుమాత్ర మంతమొందింపక తద్దియుంబ్రీతి ముద్దిడుకొని యాతొట్టెతోడ న న్నిక్కడకు దీసికొనివచ్చి కన్నకూతురుంబోలె బెంచుచుండ దల్లి