పుట:కాశీమజిలీకథలు -01.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

బడి యరుగుటయు నంతకన్న వింతయగు నిశాంతమొండు చూడంబడినది. ఈరీతి నాఱుమేడలం గాంచి యం దద్భుతమైన యలంకారముగాక మరియెవ్వరినిం గానం దైర్యంబున యెండియు జూచెదంగాక యని యందున్న నారోహణశ్రేణిమీదుగా నెక్కుటయు వేరొక్కచక్కనియంతపురము జూడనయ్యె. అదియు నదివరకు జూచినవికాయముల కన్న రమణీయమగు నలంకారముల శోభిల్లుచుండుటం జూచి యిందు దప్పక జను లుందురని నిశ్చయించి లోని కరుగుటయు నాభవనాంతరంబున హంసతూలికాతల్పమున నిద్రించుచు ననన్యసామాన్యలావణ్యమాన్యయగు కన్యయొకరిత యతనికి నేత్రపర్వము గావించినది.

అక్కాంచనగాత్రిం గాంచి మేను పులకింప నట్టె నిలుచుండ యతం డాహా! యివ్వరారోహనుగేహాలంకారమునకై చిత్రకారుండు బంగారునం గాంచి యిట్లుంచె గాబోలు. నిజముగా నిట్టికాంతలు లోకాంతరములయందైన గలిగియుందురా! కలిగియున్నచో నట్టియన్నుమిన్నుల గాంచువానిదిగదా భాగ్యమని మఱియుం దిలకించి యప్పంకేరుహాసనపై నిజాలోకనజాలంబులు నెరయజిమ్మి యాహా! యిప్పుడ నా కట్టిభాగ్యము సమకూరినట్లు తోచుచున్న దే! ఇది చిత్రంపువాల్గంటి యనుకుంటిగాని కాని యట్టునిట్టూర్పులం గదలు తదీయపయోతరంబులే నయనబంధువులయి చెప్పుచున్నవి. కాదుకాదు. అదియుం జిత్రకారకుని రచనాచమత్కృతియే కావచ్చు. భ్రమస్థితిని లేనిచో నిట్టి విజననికేతమున నేకతమున నేకతమ యిట్టి మనోహారగాత్రి నివసించెడిని? అని యాసందియము వాయ దాయంబోయి యప్పూబోడి మేనిపై గేలిడి యక్కుసుమగాత్రి గాత్రస్పర్శసుఖం బభినయించుచు నౌరా! యేమి నాభాగ్యము ఇప్పొన్నికొమ్మ బంగారుబొమ్మ యనుకొంటిని కాదు. నిజమైన వాల్గంటియే మేలు మేలు. నాకు గన్నులు గలిగినందులకు నేటికిగదా సాఫల్యమైనది.

ఇక్కన్నియు పన్నగ పన్నగవేణియో, యచ్చరమచ్చకంటియో, విద్యాధరవిద్రుమాదరియో, గంధర్వపర్వేందువదనయో, కిన్నరకిన్నరకంఠియో, శక్రచక్రవాస్తనియో, సాధ్యహరిమధ్యయో, సిద్ధపల్లవపాణియో, రంభారంభోరువో, యక్షగజగామినియో, భాస్వరకాంతస్వరగాత్రియో, రతియువతియో కావలయు గానిచో మానిసి ప్రోయాండ్ర కీసోయగము గలదే!

అని పెక్కుగతుల నాచక్కెరబొమ్మ మేనిసొంపు నాపాదమస్తకము వర్ణించుచు నట్టె యయ్యెలనాగ చెక్కిలి గ్రక్కున దద్దయుం బ్రీతి ముద్దుపెట్టుకొని యనాఘ్రాతకుసుమమగు నక్కిసలయపాణి మేనిపొత్తు నాకత్తెనేని జిత్తభవుం బతిచరుంగా చేసికొననే యని మదనవేదనాదోదూయమానసుండై యప్పల్లవపాణి నల్లన లేపబోయియు నిద్రాభంగంబు సేయనోపక తడబడుచుండ నింతలో నత్తలోదరి యదరిపడి లేచినది.