పుట:కాశీమజిలీకథలు -01.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

63

అట్లు తిరుగుచుండ గొండొకవడికి క్రొత్తవీథి యొకటి కనంబడినది. దీని వెంబడిబోయి యెవ్వరును గనబడకపోయినచో మగిడి చనియెదంగాక యని నిశ్చయించి యావీథింబడిపోవుటయు నందుగూడ మునువోలె నెవ్వరును గనబడలేదు. అంతకు మున్ను చూడని గొప్పకోట యొకటి గాన్పించినది.

దానిం జూచినతోడనే యతని కెడద నొకవిధమగు వేడుక బొడముటయు నిందు దప్పక జను లుందురని తలంచి యక్కోటగుమ్మ మరయు తలంపున ముమ్మారు దానిచుట్టు దిరిగెను. ఎందును ద్వారము గాన్పించినదికాదు.

దాని కతం డొక్కింత చింతించి యిట్టి కోటలోపలకు మార్గ ముండకపోవునా? యెద్దియేని గుప్తముగా నుండవచ్చును. నమ్మఱుగు తెరవరసెదంగాక యని మఱియు నక్కోటచుట్టును, దిరుగుచు నేల నెరియలం బరిశీలించుచుండ నొకదండ నొకగొణ్ణెము గనంబడుటయు దానింబట్టుకొని పైకిలాగినతోడనే యొకగుమ్మము తెరువబడినది. అది గుహలాగున్నను నదియే కోటలోనికి మార్గము కావచ్చునని నిశ్చయించి ధైర్యంబున నందు జొచ్చెను. చీకటిచే కొంతదనుక నతని కేమియు గాన్పించినదికాదు. నడువనడువ మఱల వెల్తురు గానంబడ దొడంగిన సంతసించి యతండు చివర కామార్గముననే కోటలో బ్రవేశించెను.

అయోమయంబగు నక్కవాటం బతండు గోటలో ప్రవేశించిన వెంటనే యెప్పటియట్ల మూసికొని పోయినది. కోటలో బ్రవేశించిన యతనికి మొదట నెవ్వరును గాన్పించలేదు. ఒక యుద్యానవనము గానంబడినది.

అదియు మధురఫలరసాస్వాదనరతమదశుకపికప్రముఖశకుంతసంతానస్వానగాన లసమానంబులగు పాదపకాయమానంబుల నల్లిబిల్లిగ నల్లుకొను వల్లరీసల్లలితలతానితానంబునకు బ్రోదులగు వేదుల జలయత్రవర్థితద్రుమకమనీయదళకిసలయప్రసూనరసపానలోలరోలంబకదంబఝంకారముఖరితంబై యుంట దిలకించి జనసంచారంబులేక యిట్టి మనోహరోద్యానవనం బుండనేరదని నిశ్చయించి యందు విసరు శీతలమందమారుతముల మార్గాయానము వాయ నల్లన నత్తోటం దాటి మఱియుం గొన్నివాకిళ్ళు గడచి విచిత్రవస్తుసిస్తులాలంకృతంబులగు ననేకభవనంబుల గాంచియు మునువోలె నందెవ్వరిం గానక విభ్రాంతస్వాంతుండై అయ్యో! ఇట్టి దేవతాభవనంబుల జనులు లేకుండుట కెద్దియో కారణంబని మఱియు మఱియుం దిరుగుటయు దేవసభం దిరస్కరించు సభయొకటి నేత్రపర్వము గావించిన నచ్చటి కరిగి దాని యలంకారమున దచ్చెరువందుచు నలుదిక్కులం బరికింప నొక దెస సోపానంబులు గానంబడినవి.

అమ్మెట్లెక్కి పోయిన మునుజూచిన సభకన్న వింతయైన రవిరహితమగు మందిరమొండు గానంబడియెను. దానిం దిలకించి మూలనున్న యున్నతసోపానంబులం