పుట:కాశీమజిలీకథలు -01.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఇదియ ముమ్మాటికిని ప్రమాణమని యొకరిచేతిలో నొకరు చేయివైచికొని తురగములను వస్తువులను గాచుటకై సాంబుని నాతరుమూలంబున నుండ నియమించి తూర్పుదెసకు వసంతుడును దక్షిణమునకు రాముడును బశ్చిమమునకు బ్రవరుండును నుత్తరదిశకు దుండుడును నాకొమ్మ లెక్కి పోయిరి.

వసంతుని కథ

అందు రాజకుమారుండు తూర్పుదెస కఱిగిన కొమ్మమీద భూమిమీదవోలె రెండహోరాత్రంబులు నడిచెను. పిమ్మట నిలువంబడి నడచుటకు వీలు లేక చేతులంగూడ మోపుచు నాలుగుదినములు నడిచెను. పిమ్మట రెండునాళు లంతకన్న సన్నమగుట మఱియు బ్రాకి నడువవలసి వచ్చినది. ఇట్లు ఎనిమిది దివసములు నడచునంత నాకొమ్మ యవసానము గాన్పించినది. ఆ చివర నిలువంబడి చూచిన నొకవింత గనంబడెను. మొదట బ్రళయకాలవాతూలరమాలోలకాలజీమూతమాలికవలె నలుదెసలం గ్రమ్ము ధూమమ్మును అంతలో నాధూమస్తోమం బదృశ్యమై తదందమునుండి ప్రచండమధ్యందినమార్తాండకిరణప్రకాండసముద్దీపితవీతిహోత్రప్రజ్వలజ్జ్వాలామాలికల పోలికను నాలుక దెరచికొని దెస లావరించు పెనుతేజంబును అదియు జూడజూడ నగోచరంబై విద్యుత్ప్రభావిభాసురాభ్రంలిహాగ్రంబులగు కార్తస్వరమయసౌధచయంబులును గాన్పించినవి.

అప్పుడు వెరగుపడి యతం డోహో! ఇది యొకపట్టణమువలె నున్నది. మొదట గనిపించిన వికారములన్నియు నేతన్నగరప్రభావబలంబులే! మేలు మేలు! నాకింకను మొదలు చేరుటకు జాలగడువు గలదు. కావున నింతలో నీపురవిశేషంబు లరసివచ్చెద గాకయని నిశ్చయించి యల్లన నాశాఖాగ్రంబునుండి పుడమికి దిగి ధైర్యసాహంబులే తనకు దోడులై యుండ నాపట్టణమున కరిగెను.

అం దొకమానవుడుగాని జంతువుగాని పక్షిగాని కనంబడలేదు. సాహసముతో బురము ప్రవేశించి యాసౌధంబుల తలుపులన్నియు ముద్రానిగళఘటితములై యుండుటం జూచి యెన్నడును జనసంచారము లేనట్లు తోచినతోడనే యతండు ఔరా! ఇది మునుపు చూచిన కానీనుని నగరముకన్న చిత్రముగా నున్నదే. అతనికన్న బుద్ధిమంతు డీపుర మేలుచున్నవాడు గాబోలు. నిదియుం జూచెదంగాక యని యప్పురవీథులంబడి నడువ సాగెను. అందలి గృహములన్నియు నేకరీతిగా నుండుటం బట్టి తిరిగినవీథినే తిరుగుచు జూచినగృహమునే చూచుచు ననేకవిధంబుల బరిభ్రమించి పెక్కుతడ వావీట మేటివీథులన్నియు దిరిగెను. వచ్చినవీథియుం బోయినవీథియు దెలిసినదికాదు.