పుట:కాశీమజిలీకథలు -01.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవమజిలీ కథ

61

రెండవమజిలీ కథ

విను మట్లు మాయావస్త్రములు ధరించి రాజుగా రూరేగింపున కఱిగిన వెనుక వరప్రసాదు లట్టిచీటిని వ్రాసి గోడ కంటించి తమసామగ్రి గుఱ్ఱంబులపై సద్దుకొని యయ్యుత్తమాశ్వము లెక్కి యొరు లెరుంగకుండ నుత్తరమార్గంబునం బడి మునువోలె నతిజవంబునం బోయిరి. అమ్మార్గంబున గడునడవి బలసియుండుటచే నరుగ సంకటమైయున్నను వెరువక వారు వారువముల నేకరీతి నడిపించుచు నడ్డము వచ్చిన క్రూరసత్వంబుల బరిమార్చుచు ఫలహారములచే నాకలి యడంచుకొని మూడుదినము లేకరీతి నడచిరి కాని తెరపి కాన్పించినది కాదు.

మూడవనాడు మధ్యాహ్నంబున వారు పిపాసావివశులై యరుగుచుండ దైవవశంబున నొకచో మధురసలిలవిలసితమగు సరోవరముతీరంబున శాఖాంతకర్షితదిగంతమగు వటవృక్ష మొండు నేత్రపర్వము గావించినది.

దానిం జూచి మిగులసంతసించుచు నాపురుషశ్రేష్ఠు లం దొకచో గుఱ్ఱముల దిగి మార్గాయాసంబు వాయ నత్తటాకంబున జళకేళిందేలి యందు వంట జేసికొని భుజించినవెనుక శీతలసాంద్రచ్ఛాయాభిరామంబగు తత్ప్రదేశంబున దత్సరోవరకమలముకుళసౌరభచోరకంబులగు మలయానిలకిశోరంబులు మార్గశ్రమం బపనయింప హాయిగ నిద్రించి కొండొకవడికి మేల్కని యల్లన నాపాదపచ్చాయంబుల దిలకించుచు నాలుగుదిశలను వ్యాపించియున్నశాఖలు నాల్గంటికి నవసానము గాన్పింపని మిగుల వెరగందుచు ఆహా! యీ వటవృక్ష మెంతవింతగా నున్నదో చూచితిరా? ఇందు మనమెన్నడు జూడని విచిత్రపుపక్షు లెన్నియో కులాయంబుల నిర్మించుకొని హాయిగా విహరించుచున్నవి. మఱియు నుక్కుకంబముల వంటి యూడలచే భరింపబడి నలుదిక్కుల కొసలారయు తలంపునబోలె వ్యాపించియున్న యిన్నగశాఖలంబడి శృంగాటకంబునవలె నిరాటంకంబుగా శకటంబులు సైతము బోవచ్చునుగదా! అని పెక్కుతెరగుల నామ్రానుసోయగము వర్ణించుచుండ రాము డొకయుత్సాహంబు మనంబునం దీపింప వారితో నిట్లనియె.

తమ్ములారా! ఈకొమ్మల పొడవెంత యున్నదో చూతమే! యనుటయు వారు వల్లె యనిన పిమ్మట వెండియు నతం డట్లయిన నెల్లర మొక్కొక్కశాఖం బరీక్షించినచో బెక్కుదినములు పట్టును.

సాంబుడు తక్క దక్కిన నలువురము నాలుగుకొమ్మలవెంట బడిపోయి యా దెసనున్న విశేషంబులం దెలిసికొనివత్తము. అప్పయనంబున కారుమాసములు గడు వేర్పరచుకొనియెదము. ఏపాటి వింతలు గాన్పించినను నమ్మితి దాటింపం మరల తరువు మొదలుచేరవలయును. అందరును జేరుదనుక దక్కినవా రీప్రదేశమున నుండదగినది.