పుట:కాశీమజిలీకథలు -01.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నాక్రాంతమైయుండు నాభవన మిప్పుడు శూన్యమై యున్నది. అం దెవ్వరును లేరు. వారి సామానుసైత మేమియు గాన్పింపలేదు. ఆ మాయావు లెచ్చటికో పారిపోయిరని తలంతుము. వెదక వెదక నొకమూల నీపత్రిక గనంబడినది. ఇది వాండ్రు వ్రాసినట్లే యున్నది చూడుండని పలుకుటయు విస్మయమందుచు మంత్రి దానిం గైకొని యెల్లరు విన నిట్లు చదివెను.

"మహారాజశ్రీ యపూర్వదుర్మార్గచర్యాభిలాషులైన
కానీన మహారాజుగారికి
కపటపు పట్టుసాలీలు వ్రాసిన యాజ్ఞ యేమనగా-

నీవు లోకవిరుద్ధమగు మార్పులజేసి ప్రజల బెక్కుతెరంగుల బాధించుచుంటివి గాన నిన్ను వంచించి యది మాన్పించుటకై యింద్రునిచే బంపబడిన దూతలమైన మేము నీ కిట్టి యవమానము గలుగజేసి యదృశ్యులమైతిమి. ఇకమీదనైన బుద్ధిగలిగి యట్టి విపరీతపుశాసనము మార్పుజేసికొని సుబుద్ధికి మరల మంత్రిత్వ మిచ్చి న్యాయంబుగ రాజ్యమేలుము. లేకున్న మాయాజ్ఞ తిరస్కరించినట్లు భావించి నిన్ను బెక్కుచిక్కులం బెట్టి రాజ్యభ్రష్టునిం జేయుదు మిదియ ముమ్మాటికిని యాజ్ఞ."

అని చదివినరాజు మిగుల భయపడి యోహో! మన మార్పు యింద్రునికి సైతము విరోధముగా నున్నదికాబోలు! త్రిలోకాధిపతియగు సురపతితో ద్వేషము బూని యెవ్వడు రాజ్యము చేయగలడు? ఇకజాలు నతనియాజ్ఞ శిరంబునం బూనదగినదే కనుక యిప్పుడ రాత్రి రాత్రిగా బగలు పగలుగా నెంచి వ్యాపారములు జేయ ప్రజల కాజ్ఞాపత్రికలు వ్రాయుడని మంత్రి కాజ్ఞాపించి యప్పుడ సుబుద్ధిని బిలువనంపి యతని యిష్టానుసారముగ మునువోలె రాజ్యం బేలుచు సుఖంబుండెను.

అని యెఱిగించి మణిసిద్ధుడు గోపాలా! యిప్పుడు చల్లబడినది. నడువవలసిన సమయ మయినది కనుక కావడి యెత్తుము. తదనంతర కథావృత్తాంతము పెద్దదిగ నున్నది ఇప్పుడు తేలదు. రాత్రి మజిలీలో బూర్తిగా జెప్పెద ననుటయు నక్కథాశేషము వినుటకు మిగుల దొందరగలవాడై వాడు లేచి కావడి యెత్తుకొని నడువసాగెను. యతీంద్రుండు మౌనం బవలంబించి ప్రణవాక్షరజపము జేసికొనుచు విశ్వేశ్వరాయత్తచిత్తుండై నడవ దొడంగెను. అట్లు వారతిజవంబున నడుచుచు సాయంకాలపుమజిలీ చేరిరి. అందొకసత్రంబున భోజనాదిసాయంకాలకృత్యములు నిర్వర్తించిన పిమ్మట నమ్మణిసిద్ధు డొకపరిశుద్ధప్రదేశంబునం గూర్చుండి శ్రద్ధాళుండై యున్న శిష్యునకు దరువాయికథ చెప్పఁదొడంగెను.