పుట:కాశీమజిలీకథలు -01.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరప్రసాదుల కథ

59

వెల్లడియగునని యట్లంటిని గాని యది యథార్థము గాదు. నీవును చీర సొగసుగా నున్నదని పొగడితివి గదా! నీకు యథార్థముగా నది గనిపించినదా? మన యిరువురనడుమ మరుగు లేదుగదా యని యడుగుటయు నప్పడతియు గుట్టువిడచి మగనితో నిట్లనియె.

నాథా! మీరును, మంత్రియు మఱియు నున్నవారును నేసినవసనంబులం జూచి మిగుల స్తుతిచేయదొడంగిరి. నా కాపళ్ళెరమం దేమియు గాన్పింపకున్నను మీకు గోచరమైన తెరంగు తిలకించి నా మాతయందు బాతకం బారోపించి యాగుట్టు వెల్లడిచేయక యట్లంటిని గాని మీరును నేనును దిగంబరులమై యున్నట్లె నాకు గాన్పించినది. ఇదియ యథార్థము, అని యామె పలికినతోడనే యాఱేనికి లజ్జాక్రోధమ్ములు మనంబున నొక్కసారి యావిర్భవింప నప్పుడే వేరొక వలువంబు ధరించి యమాత్యుని రప్పించి యతనితో నిట్లనియె.

మంత్రీ! యా పట్టుపాలీలు పన్నినతంత్రంబు జూడ గడుగపటముగా దోచుచున్నయది. నీపు రెండుతేప లావలువల బరీక్షించితివిగదా? నిజముగా నీకవి గాన్పించినవేమో చెప్పుము! భయపడకుము. మా కేమియు నందు గాన్పింపలేదని తమస్థితిని జెప్పినతోడనే మంత్రియు నయ్యా! తమ రిట్లడిగినపుడు నిక్కము దాచరాదు. గ్రామాధికారులు సేనాపతియు దమకు గాన్పించెనని చెప్పినవిషయముల మనంబున దిలకించి యందేమియు నాకు గాన్పించకున్నను దత్ప్రభావంబున నట్లయ్యెనని మాతృదోషము స్థిరపరచి మొదట నట్లంటిని.తరువాత దేవరవారే కనబడినవని బొగడిన నేనును బొగడితిని. నాకంటి కేమియు గానబడలే దిదియ యథార్థము. పరువు లోపమగునని బొంకినతప్పు సైరింపుడని వేడుకొనియెను అప్పు డారాజు తలగంపించుచు నప్పుడు సేనాపతిని గ్రామాధికారులను మరియుం దనతో బట్టుసాలీల లోగిలిలోనికి వచ్చిన పెద్దమనుష్యులను బెక్కండ్ర బిలిపించి యా బట్టల విషయమై మంత్రి నడిగినట్లు వారి నడుగుటయు వారును నట్లె యుత్తరము జెప్పిరి. అప్పు డప్పతి ముప్పిరిగొను కోపంబున నా కపటపుపట్టుసాలీల బట్టితెండని యమదూతలంబోలు కింకరులం బనిచి తానును భార్యయు వస్త్రహీనులై యూరేగిన తెరం గంతరంగంబున దిలకించి యగ్గలమగు సిగ్గున దలవాల్చి పెక్కుగతుల జింతించుచుండెను.

రాజభటు లతిజవంబున నా కపటకువిందులున్న మందిరంబున కరిగి యందు సందడి యేమియు లేమింజేసి సందియమందుచు లోనికిబోయి చూడనెవ్వరును గాన్పించ లేదు. మఱియు నా శూన్యగృహము నలుమూలలు వెదుకగా నొకచో నొకపత్రిక దొరకినది. దానిం గైకొని వాండ్రు వెండియు నన్నరపతి యొద్దకుం జని యతనితో నిట్లనిరి.

దేవా! సంతతము నపూర్వవస్త్రదర్శనోత్సుకులగు పౌరుల కోలాహలముచే