పుట:కాశీమజిలీకథలు -01.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దిట్టింపనేల? కనంబడుచున్నవనియే బొంకెదను. అని తలంచుచు నా రాజపత్ని ధాత్రీశా! రాత్రిం పగలుగా మార్చిన మీప్రభావమే తాదృశంచే! ఇట్టిపుట్టంబులం గట్ట మీకుకాక యొరులకు శక్యమా? వీనిని దేవితావస్త్రములని చెప్పవచ్చునని పలికి యూరకున్నది.

ఇట్లు కొంతసేపు వాండ్రందఱు వస్త్రప్రభావంబు నగ్గించిన పిమ్మట రాముడు మొదట నియమించిన ప్రకారము వాని గైకొని కుచ్చిళ్ళు పెట్టున ట్లభినయించుచు రాజుగారిని నిలువబెట్టి కట్టుకొనియున్న వసనము విడదీసి యామాయావస్త్రము కట్టువానివలె చుట్టబెట్టుటయు దిగంబరుడై యుండ నెల్లరు చూచుచుండియు మాతృదోషమునం జేసి తన కొకనికే యట్లగుపడుచున్నదని ప్రతిమనుజుడు ననుకొనెనుగాని యారహస్య మొక్కనితోనైనను జెప్పినవాడులేడు.

భూపతియు దన దిగంబరత్వము మాతృదోషమునంబట్టి తన కొక్కనికే కాన్పించుచున్నదనుకొనెను గాని యెల్లరకు వెల్లడియగుచున్నదని తెలిసికొనినచో మిగుల సిగ్గుపడవలసివచ్చును. అట్లు తలచియు గొంతలజ్జ మనంబున బెనగొనుటయు బూర్ణముగా దలయెత్తలేక యిటునటు చూడదొడగెను. పిమ్మట నంతకుమున్ను నిరూపించియున్న యొక కాంతను రాజుభార్యకు జీర గట్ట నియమించుటయు నాబోటియు రాజవధూటిం జాటునకు గొనిపోయి మాయాపాటవంబు దేటపడ మున్ను ధరించియున్న కోక విడలాగి వరప్రసాదులు చేసినదానం గట్టుదానివలె నాలుగైదుసారులు పైకిని గ్రిందికిని ద్రిప్పి దిగంబరిగానే సభకు దోడ్కొని వచ్చినం జూచినవారెల్ల మునుగల్గిన యనుమానముతోనే పరక్తులై యుండిరి.

నృపతియు దనభార్య దిగంబరత్వము తనకొక్కనికే తేటయగుచున్నదని సమాధానపడి యూరికుండెను.

ఆమెయు నట్టే యెంచి తలపించి పలువిధముల జింతించుచుండెను. పిమ్మట నూరెగింపునకై యాదంపతు లలంకరించిన పట్టపుదంతి నెక్కి చుట్టును సకలపరివారములు సేవింప దూర్యనాదంబులు రోధోంతరాళంబు నిండ మెండువైభవంబున నూరేగుచుండ బౌరకాంత లావింత జూచుటకై యత్యాతురముతో సౌధోపరిభాగంబుల గవాక్షంబుల దలుపుదెరల చూచుటయు దిగంబరులై యున్న యాదంపతుల తెరంగున కంతరంగంబుల వేతెరంగుల బరితపించి సిగ్గున గవాటంబులు మూసుకొనిరి.

ఇట్లు విధిలేక యారాజు గొంతసే పూరేగి యంతటితో చాలించి యెల్లవారిని వారివారి నివాసంబుల కనిపి భార్యతో నంతఃపురంబున కరిగి కేళీతల్పంబున గూర్చుండి మెల్లన నిట్లనియె.

కాంతామణీ! నే నింతదనుక గుట్టుబట్టితిని గాని యిక నాపనోప వినుము. నాకన్నులకు నీవు గట్టుకొనిన చీరగాని నే ధరించిన వలువగాని కాన్పింపలేదు. నా యపకీర్తి