పుట:కాశీమజిలీకథలు -01.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవతావస్త్రముల కథ

57

బాగ్యము లేకపోయెగదా యని యామె గుఱించి చింతించుచుంటినని యుత్తరము చెప్పిన రాము డిట్లనియె.

దేవా! దేవర యిట్టి యుత్సాహసమయంబున నమ్మగారి గుఱించి చింతింపం బనిలేదు. ఆమె కడునిల్లాలని తమ కీదేవతావస్త్రములు గనంబడుటంజేసి తెల్లమగుచున్నది. వస్త్రములవిషయ మేమైన సంకోచ మున్నచో వక్కాణింపుడు. మేము చెప్పినంత యొప్పుగా నున్నవియో లేదో పరిశీలింపుడని వట్టిపళ్ళెరములో జేయిపెట్టి యిటు నటు తిరుగవేయుచు మీదున కెత్తి చూపించుటయు నాపుడమిఱేడు వచ్చియు రాని స్వరముతో నోహో నాయదృష్ట మేమి? యిట్టి యపురూపపు పుట్టంబుల గట్టు భాగ్యము గలిగినది. అమాత్యశేఖరా! యీ చిత్రపటంబులయంచు లెంత వింతగా నున్నవియో చూచితివా? ఇట్టి మృదువు భూలోకములో లేదుసుమీ! నడుమ నడుమ జరీపూవులు మెరయుచున్నవి. ఆయ్యారే! దుర్బుద్దీ! ఇవి నీకెట్లు కనబడుచున్నవో చెప్పుము. నీవు మొదట జూచినప్పుడు వీనికి సుందరసాంద్రత్వము లేదని దలంచెదను. ఇప్పటికి నప్పటికి భేద మేమైన నున్నదియా? యని సందియంబు దీర వెండియు నడిగిన నామంత్రియు వచ్చియు రాని స్వరముతో నిట్లనియె.

దేవా! దేనికైనను మెఱుగుపెట్టినప్పుడుగల తళుకు రచించునప్పుడు గలుగునా? నేను మొదట జూచినప్పటికన్న నిప్పు డీవస్త్రంబులు మిక్కిలి మనోహరములుగా నున్నయవి. ఈ సాంద్రత్వము, ఈ భావశ్యము అప్పు డింతవిన్నాణముగా లేదు. దేవర యనిన ట్లీయంచు మిక్కిలి చక్కగా నున్నయది. కాబట్టియే వీనికి దేవతావస్త్రములని పేరు వచ్చినది. వీని నమానుషములనుట కేమియు సందేహము లేదు. అపూర్వక్రియాకరణదక్షులై యున్న దేవరకిని తగియున్నవని యతండు మిక్కిలి స్తోత్రములు గావించెను. తరువాత నానృపతి సభ్యులంజూచి యివి యెట్లున్నవని యడగిన వారును దమ కం దేమియు గనబడకున్నను నది మాతృదోషముగా దలంచి కనంబడినట్లే యభినయించుచు వాని నెక్కుడుగా వినుతించిరి.

పిమ్మట రాజు భార్యతో, బోటీ! నీవు వీనిం జూచితివా? యెట్లు కనంబడుచున్నవో చెప్పుము. వీండ్రు మొదట మనతో చెప్పినంత సొగసుగా నున్నవియా యని యడిగిన నచ్చేడియ పరిశీలించునట్ల భినయించుచు నాత్మగతంబున అయ్యో! నాతల్లి యెంత దుష్టురాలో కదా! వీండ్రందఱికి గనంబడిన వస్త్రములు నా కేమిటికి గనంబడవు? ఆమె కట్టి చెడువాడుక యున్న ట్లెప్పుడు వినియుండలేదే! అయినను నాడువాండ్రు క్రూరులుగదా! అన్నన్నా! యిందరిలో నేనొక్కరితనే జారిణీపుత్రికనైతిని. అందఱు కనంబడుచున్నవనియే చెప్పుచున్నారు. ఇప్పుడు నేనుమాత్రము నిజముచెప్పి నాతల్లిని