పుట:కాశీమజిలీకథలు -01.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నియమించి మంత్రిసామంతహితపురోహితాదివర్గము సేవింప శుభముహూర్తమున భద్రగజముపై నెక్కి తూర్యనాదములు భూనభోంతరాళము నిండ మెండువైభవముతో నూరేగి యా కపటకువిందులున్న మందిరద్వారము జేరెను.

అప్పుడు వరప్రసాదులు వచ్చి ప్రధానవర్గముతో రాజదంపతుల లోపలకుఁ దీసికొనిపోయి యుచితాసనములఁ గూర్చుండఁజేసి పెక్కుస్తోత్రములు గావింపుచు నెదురు నిలవంబడిరి. అప్పుడా యొడయఁడు తాను తెచ్చిన మణిభూషణాంబరములతో వారి కీయవలసిన విత్తమంతయు బంగారుపళ్ళెరముతో వారి కందిచ్చి యత్యుత్సాహముతో దేవతావస్త్రము లెందున్నవని యడిగెను.

అప్పు డారాముఁడు సంజ్ఞచేసినంత వసంతుఁ డొకపళ్ళెరము ప్రవరుఁ డొకపళ్ళెరము దండుఁ డొకపళ్ళెరము దెచ్చి రాజుముం దిడి ఇవిగో దేవతావస్త్రములు చూడుఁడని పలికిరి.

ఆ పళ్ళెరముల దన కేమియు గనంబడమి జెందం బాందోళనమంద నేమియు దోచక మేనం జమ్మటలు గ్రమ్మ దుఃఖావేశముతో నిట్లు తలంచెను .

అయ్యో! ఇట్టి వింతపుటంబుల జూచు భాగ్యము నాకు బట్టినదికాదు. మొదటనే నే నిట్టి కౌలటేయుడని తెలిసినచో నిట్టి పనికి బూనికొనకపోవుదునుగదా! మోసపోతిని; పదుగురిలో నవమానితుడ గాకుందునా? ఛీ! ఛీ! నాయట్టి మండలాధిపతిం గనిన యాడుది సైరిణిమయ్యెనా? ఏడంతఃపురములలో దాచిపెట్టినను రాజస్త్రీలు చెడుకార్యము లాచరింతురని వాడుకయున్నది. ఆ మాట యేల తప్పెడిని అన్నన్నా! గ్రామాధికారులు దండనాథుడు ప్రధానియు నీ చిత్రపుట్టంబుల గన్నులార జూచితిమని చెప్పిరి. వారి తల్లులకుగల నియమము నా తల్లికి లేకపోయినది. అక్కటా! యిప్పు డక్కపటాత్మురాలు బ్రతికియుండిన బొట్ట చీల్చి చంపకపోవుదునా? యిప్పు డీయదృశ్యవస్త్రంబుల గట్టుటెట్టొకో యని చింతాకులస్వాంతుడై యున్న యన్నరనాథునకు రాముం డిట్లనియె.

దేవా! యేమియుం బలుక కూరకుంటే రేల? పుట్టంబులు గాన్పింపలేదా? లేక సొంపుగానున్నవి కావా? గుణదోషనిరూపణము జేయుడు. తమరు ధరించు వలువ లివియే. ఎంత మృదువుగా నున్నవియో ముట్టిచూడుడు. అనుటయు రాజు తొందరపడి కాన్పింపలే దనబోయి యంతలో సవరించుకొని యట్టులన్నచో దనగుట్టు బయలగుటయేకాక ఫలమేమియు లేదని నిశ్చయించి నే నూరక యున్నందులకు గారణము మఱేమియు లేదు. బట్టలు గనంబడుచున్నవి. వీనిం జూచినతోడనే నాకొక్క విచారము గలిగినది. వినుండు. ఇట్టి వింతవస్త్రంబులు దాల్చి మా తల్లికి మ్రొక్కు