పుట:కాశీమజిలీకథలు -01.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవతావస్త్రముల కథ

55

సాగనంపి యతని యవివేకమునకు నవ్వుకొనుచు నట్టిపనులు మాని తమ కుత్సాహమైన వ్యాపారముతోఁ గాలక్షేపము చేయఁదొడంగిరి.

పిమ్మట మంత్రియు రాజసముఖమున కరిగి ఱేనికి మ్రొక్కి దేవతావస్త్రంబుల మహిమనంతయు గ్రామాధికారులును దండనాథుఁడును జేసిన వర్ణనకన్న నూరు మడంగు లధికముగా వర్ణించెను. అప్పుడు కానీనుఁ డావస్త్రంబులు ధరించుభాగ్య మెప్పు డబ్బునని గడియలు లెక్క పెట్టుచు నిమిషము యుగమువలె నానెల వెళ్ళించెను.

ఇంతలో వారు చెప్పిన యారుమాసములు బూర్తియైనవి. ఒకనాఁడు రాముడు ఉచితవేషముతో రాజసభకుఁ బోయి సన్మానము లంది రాజునకు మ్రొక్కునట్లు సభాసదులకు నమస్కరించుచు నిట్లనియె.

దేవా! దేవతావస్త్రములు సిద్ధమైనవి. వాని గుణంబు లిదివరకే మీరు విని యుందురు గదా? మరియు వాని ధరించుపద్ధతి మొదటనే మేము వక్కాణించితిమి . నేఁడు మంగళదివసము. ఊరేగి వచ్చి పుట్టంబులు దాల్చుఁడని చెప్పెను.

అప్పు డాఱేఁడు అపరిమితసంతోషము జెందుచు కువిందా! మీ రిట్టి విద్యాపాటవ మెచ్చట నేర్చుకొంటిరి. ప్రధానప్రముఖులు మీరు నేయుచున్న వస్త్రంబులు కడువిస్మయము గొలుపుచున్నవని స్తుతిసేసిరి. అందులకే వీని దేవతావస్త్రములని చెప్పుటకుఁ గారణమైనది. మీ దేశపుఱేఁడు వీనిని ధరించునాఁడు ఏమి చేయువాఁడో యెఱింగింపుడు. మేము నట్లే వచ్చి యవ్వలువల ధరింతుమని యున్మత్తుండువోలె నడిగిన మాటయే యడుగుచుఁ జెప్పిన మాటయే చెప్పుచు హృదయంబునఁగల సంతోషము వెల్లడింపుచుండెను.

అప్పుడు రాముఁడు దేవా! దేవతావస్త్రముల నేత మేము బహువర్షంబులు తపము జేసి నేర్చుకొంటిమి. దివ్యప్రభావసంపన్నములగు నీవస్త్రంబులు ధరించునాఁడు మాఱేఁడు దివ్యోత్సవములతో భద్రగజముపై భార్యతో నెక్కి యూరేఁగి వచ్చి బ్రాహ్మణులకు షోడసమహాదానములు గావింపుచు మా సభకువచ్చి మావలన నా పుట్టము లందుకొని మాకు గానుక లిచ్చి యాపుట్టంబుల దాల్చి వెండియు వేదండ మెక్కి యూరేగి యింటి కరుగుదురు . ఇవి దేవతావస్త్రంబులు గావున స్త్రీలకు నాఁడు పురుషదర్శనము దూష్యముగాదు. మా యేలిక కన్న దేవరవారు నూతనమార్గనిర్ణేతలు గావున నీవిభవ మధికముగాఁ గావింపఁదగునని చెప్పి యతం డాయెకిమీని యనుమతి వడసి యింటికిం బోయెను.

ఆ నరనాథుండును రాముని మాటలకు నుబ్బి యప్పుడు గ్రామమంతయు నలంకరింపుమని చాటింపించి పట్టణప్రజలెల్లరు నూరేగునప్పుడు తనతో నుండునట్లు