పుట:కాశీమజిలీకథలు -01.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

జెప్పుము. ఇతరులు చెప్పినచో నాకు నమ్మకముండదు. పూర్తిగా నేత కాకున్నను వస్త్రముల నిగ్గుతేలు. వేగ బోయిరమ్మని చెప్పుటయు రాజునాజ్ఞ శిరంబునం బూని మంత్రియు నుచితపరివారముతో వరప్రసాదులున్న గృహములకడ కరిగెను. ద్వారపాలకునిచే నతనిరాక విని యా కుమారులు నేయుసామగ్రి దూలమునకు వ్రేలాడఁగట్టి గోతిలోఁ గూర్చుండి యిటుదటు వట్టికండెల విసరుచు వ్రేలాడఁగట్టి ధట్టించుచు బట్టలు నేయువారివలె నభినయించుచుండిరి.

ఇంతలోఁ బ్రధాని లోపలకు వచ్చినంత రాముఁ డెదుర్కొని వినయ మభినయించి గద్దియం గూరుచుండఁబెట్టి యాగమనకారణం బడిగి తెలిసికొని నేతగాండ్రున్నతావునకుఁ తీసుకొనిపోయి యార్యా! సగమునేత యైనది. చూడుఁడు! ఇంక నొక్కమాసములోఁ బూర్తియగును. దండనాథుఁడు నూలు చూచినవాఁడు కాని నేత చూడలేదు. తమరు నేత చిత్తగింపుఁడు. తంతువుల మార్దవాదిగుణంబు లిదివరకే వినియుందురుకదా? దాని యథార్థము తమరుగూడఁ బరీక్షింపుఁడు. అందుమేల్కట్టు విమర్శింపుఁడు. అని చుట్టినదండ మూరక విప్పినట్టు విప్పి చూపించుటయు దానఁగాని మగ్గమునగాని తనకేమియు గాన్పింపకున్నతెరంగునకు నంతరంగమున వ్యాకులపడి వాని మాటలేమియుఁ బాటింపక అతం డిట్లు చింతించెను. అక్కటా! గ్రామాధికారులకు సేనానాయకులకుఁ గాన్పించిన నూలు నా కేమిటికిఁ గాన్పించదు. నా తల్లి జారిణియై సతీతిలకమని వాడుక చెందినది. ఎట్లో తెలియదు. ఆడవాండ్ర సుగుణములన్నియు నిట్లే కపటభూయిష్టములై యుండును. స్త్రీలలో పతివ్రతలు లేరని రూఢిగాఁ జెప్పఁగలను. పైకి మహాగుణమణులుగాఁ గాన్పించుచుఁ జాటున ననేకదుష్కృత్యములు చేయుచుందురు. శ్లో॥ "స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం దేవోనజానాతి కుతోమనుష్యః" అనునట్లు స్త్రీల చిత్తము భగవంతుఁడే యెఱుంగడట. మనుష్యున కెట్లు గోచరమగును. మంత్రినని పెద్దపేరు పెట్టుకొని గౌరవముగా సంచరించు నా గుట్టు బయలైనచో నన్నెవరు మన్నింతురు? రాజు సైతము నాపుట్టుక గురించి పరిహాసము సేయక మానునా? ఈ రహస్యము గోప్యముగానేయుంచి కాన్పించిన ట్టభినయించినచో నేకొరంతయుఁ గలుగకుండునని నిశ్చయించి చింతవిడచి యల్లన రామునితో నిట్లనియె.

కువిందాగ్రేసరా! నే ననేకవస్త్రంబులు చూచితినిగాని యింత వింతయైన నూలును మృదువైన పుట్టములును నెచ్చటను జూచియుండలేదు. గ్రామాధికారులు సేనానాయకుఁడు నుడివిన దానికన్న సొగసుగా నున్నవి. మాఱేఁడు చాల వేడుక పడుచున్నాఁడు. వేగఁ బూర్తిచేయుఁడు. మీకు బహుమతి నిప్పింతునని పలికి యతఁడు వెడలుతఱి రాముం డార్యా! అన్నిటికిని తమదేసుఁడి బాధ్యత. మా కేమి పారితోషిక మిప్పింతురో! కటాక్షముంచుఁడని మిగుల వేడుకొనువానివలె నభినయించుచు మంత్రిని