పుట:కాశీమజిలీకథలు -01.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గూడ మార్పనోపుదురేని యట్టినామంబులు వానికిఁ బెట్టనగు. దాని మూలముగా స్వర్గమునకుఁ బ్రతిస్వర్గము సృష్టించిన విశ్వామిత్రునకుఁబోలె తమకును గొప్పఖ్యాతి రాఁగలదు. కాని వ్యాపారముల మార్చినంత మాత్రముననే యట్టిఖ్యాతి రానేరదు. రాత్రిసంచారము క్రూరమృగములకు రాక్షసులకు గాక మనుష్యుల కెట్లు పొసంగును. వెలుతురులేక యేపని చేయుటకు వీలులేదు గదా? అట్టి చీకటిలో పగటిపను లెట్లు చేయుదురో విచారింపవలదా? అట్టి నియమము భగవంతునిచే జేయఁబడినది. దానిని మనుష్యులు మార్పఁగలరా?

మనుష్యకృత్యములు మార్చినను మార్చవచ్చునుగాని దైవకృత్యముల మార్చ నెవరి తరంబు? మఱియొక రాజు పాదములతో నడుచుట లెస్సగాదని చేతులతో నడువమనును . ఇంకొకఁడు కన్నులతో విని చెవులఁతో జూడమనును. ఇట్లు విపరీతకృత్యములు ప్రజలెట్లు చేయగలరు? చేయశక్యముకాని పనుల విషయము శాసనముల నియమింపరాదు. దైవికముల మార్చుట శక్యముకాదు. అప్పని యపఖ్యాతికి మూలమగును. ప్రజావిరోధము సంభవించునని నిర్భయముగా నాసుబుద్ధి యుపన్యసించినంత నా భూపతి యత్యంతకోపముతోఁ దనయాజ్ఞకు నాటంకము చెప్పినందుల కప్పుడే యా మంత్రి నుద్యోగమునుండి తప్పించి దుర్బుద్ధిఁ బొగడుచు నమ్మరునాఁటినుండియుఁ గ్రొత్తశాసనము పడుపున జనులు నడుచుకొనునట్లు దేశమంతయుఁ బ్రకటింపజేసెను. రాజశాసన మతిక్రమించిన వారిని గఠినముగా శిక్షింతుమని చాటింపించిరి. అట్లు చేయుటకు రాజభటులఁ బెక్కండ్ర నియమించిరి.

అట్టి యుగ్రశిక్షకు వెఱచి యందలి ప్రజలు దీపంబులకుఁ జమురు దెచ్చుకొనలేకను చీఁకటి నడువలేకను నిద్దుర కాగలేకను బెక్కుతెఱంగుల నిడుమలఁ బడుచుండినను విషనాభిలో పురుగులవలె జన్మభూమి విడువలేక నయిదాఱువత్సరము లధికక్లేశము లనుభవించిరి. తుద కదియును నలవాటేయైనది. ఇంత మొండిజను లెందైన గలరా?

మా రాజు చరిత్ర మిట్టిది. మీరు పరదేశస్థు లెరుగమినైన నింక నిది రాత్రి యనబోకుడీ! అట్టి మాటలచేఁ బెక్కండ్రు శిక్షితులైరి. శీఘ్రముగా నీగ్రామము దాటి పోవుఁడని యయ్యజమానుఁ డయ్యూరివర్తమాన మంతయు నెఱింగించిన వరప్రసాదులు నందలిప్రజల యిడుమలకుఁ జాలిపడి యోహో! యిట్టి నీతిమాలిన నృపాలుఁ డుండునే యని యతని నాక్షేపించి యతని దుష్కృత్యము నెద్దియో యొకయుపాయమున మాన్పింపఁదలచి యందుఁ గొన్నిదినము లుండినం గాని యట్టిపని చేయుటకుఁ బొసగదని యొకగొప్పభవన మద్దెకు దీసికొని యందు నివసించి యచ్చటివారివలెనే కొన్నిదినములు రాత్రింబగళ్ళచర్యలు నడుపుచుండిరి.