పుట:కాశీమజిలీకథలు -01.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కానీనుని కథ

47

కానీనుని కథ

ఆర్యులారా! ఇదిలాటదేశము. ఈ దేశాధికారి పేరు కానీనుఁడు. వీనికి దుష్టబుద్ధి సుబుద్ధి యను నిద్దరు మంత్రులు గలరు. వారి యాలోచనానుసారము నతం డీరాజ్యం బేలుచుఁ బదివత్సరములు క్రిందట నొకనాఁ డొకసభ జేసి యందు పౌరహితపురోహితసామంతప్రముఖులు పెక్కండ్రు వినుచుండ నాయొడయండు మంత్రులతో నిట్లనియె.

అమాత్యులారా! నా చిత్తమున నిప్పు డొకక్రొత్తసంకల్ప మంకురించినది . దానిని మీ రిరువురు విచారించి గుణదోషంబుల వక్కాణింపుఁడు. భూమి పుట్టినది మొదలు పాలించిన రాజులు చర్యలు జూడ నేకరీతిగానే యున్నవి. "గతానుగతికో లోక" అనునట్లు ముందువాఁ డెట్టిచెడుత్రోవ నడచినను నది పెద్దలు నడిచినమార్గ మనియు దాని నతిక్రమింపరాదనియు, వెనుకవారు నట్లే నడుచుచుందురు. "శతాంధాం కూపం ప్రవశంతి" అనునట్లు వారును వీరునుంగూడ గ్రుడ్డివారలే. మొదటివారు తర్వాతివారికి పెద్దలగుదురు గదా! కావున నారాజ్యము వారందరు నట్లే నడుచుచుందురు. దాని మూలమున నాకు మిగుల ఖ్యాతి రాఁగలదు వినుండు. రాత్రి యనియు, బగ లనియు, నిద్రాహారములం బట్టి మనవారు దినమునకు రెండు నామములు పెట్టిరి గదా! అందు నిద్రించునది రాత్రియనియు, విహరించునది పగలనియుఁ జెప్పుదురు. దానికిఁ బదులుగా నిప్పుడు రాత్రి పగలు, పగలు రాత్రిని జేయువాఁడనై యుంటిని. నడతలం బట్టి గదా వానికట్టి నామములు వచ్చినవి? కావున రాత్రిపనులు పగటియందునూ పగటిపనులు రాత్రియందును ప్రజలు చేయఁదొడంగిరేని యట్టినామములు వానికే రూఢమగుచున్నవి. ఇదీయ మదీయసంకల్పము. దీనికి మీయభిప్రాయ మేమని యడిగిన దుర్బుద్ధియను మంత్రి మిగులయుక్తముగా నున్నదని రాజుగారిని స్తుతించెను. సుబుద్ధియు దాని కొడంబడక రాజుతో నిట్లనియె దేవా! వినుండు

శ్లో॥ "సులభాః పురుషోలోకే సతతం ప్రియవాదినః
      అప్రియస్య చ పఠ్యస్య వక్త్రాతాచ దుర్లభః."

అనునట్లు యిష్టముగా మాట్లాడువారు పెక్కండ్రు గలరు. అప్రియముగా హితమైన దానిం జెప్పువారును వినువారును లేరు. నేఁ జెప్పబోవునది తమకుఁ బ్రతికూలముగానే యుండును. ఐనను హితమైన మార్గము చెప్పకమానను. వినుం డిప్పుడు దేవరవారికిఁ దోచిన యాలోచన లోకమునకు విరుద్ధమైనదియేగాక లోకులకు మిగుల పీడాకరమైయున్నది. నిద్రాహారంబులం బట్టి రాత్రింబగళ్ళకు నామములు పెట్టలేదు. అందుఁగల చీఁకటియు వెల్తురునుం బట్టి యట్టిపేరులు వచ్చినది. తేజస్తమంబులం