పుట:కాశీమజిలీకథలు -01.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవతావస్త్రముల కథ

49

దేవతావస్త్రముల కథ

బుద్దిశాలులగు వరప్రసాదు లొక్కయుపాయంబున నా నృపతిని వంచింపఁ దలచి యొకనాఁడు పెందలకడ భోజనములు జేసి గౌరవమైన వేషములు వేసుకొని రాజుగారి హజారముకడ నిలువంబడి యొకచీఁటిలోఁ గొన్నివిషయములు వ్రాసి ద్వారపాలురచేతి కిచ్చి రాజున కంపుటయు నాచీఁటి చూచుకొనిన తక్షణము రాజుగారు వారిఁ దోడితెచ్చుట కొకయుద్యోగస్థుని బంపిన నతఁ డత్యంతగౌరవముగా వారి దోడ్తెచ్చి రాజుగారి సింహాసనప్రాంతమందు విడచెను.

రాజును వారి కెదురేగి గౌరవముగా మన్నించి యుచితపీఠికలఁ గూర్చుండఁబెట్టి స్వాగతపూర్వకముగా నిట్లనియె. పురుషవర్యులారా! మీర లెద్దేశము వా రెచ్చటనుండి యెచ్చటి కరుగుచు నిచ్చటి కెప్పుడు వచ్చితిరి? కులగోత్రనామంబు లెట్టివో యెఱింగింపుఁడు. మఱియు మీరు చీఁటిలో వ్రాసిన వింతపను లేమి చేయగలరని యత్యంతాతురముగా నడుగుటయు, వాక్పాటవముగల మంత్రిసూనుండు లేచి సభాసదులకు మ్రొక్కి రాజుదిక్కు మొగంబై యిట్లనియె.

రాజేంద్రా! మాది కాశ్మీరదేశము. పట్టుసాలికులమువారము. విచిత్రములగు బట్టలు నేయఁగలము. అట్టి పనితో మిగుల గౌరవముగా మా దేశపు రాజుగారియొద్ద నుండువార మతని కిప్పు డొకయాపద సంభవించుటచే నటనుండక మమ్ము రక్షించువారెవ్వరని యరయుచుండ యపూర్వచర్యాభిలాషులును నూతనమార్గనిర్మాణదక్షులును నగు మీ కీర్తి దిగంతవిశ్రాంతమై మా కర్ణగోచర మగుటయు వింతకార్యముల నొనరించుటయందు వేడుకగల మీరుగాక మా యపూర్వవిద్య పరీక్ష సేయు దక్షు లన్యులు లేరని నిశ్చయించి యుష్మద్దర్శనార్ధులమై యీదేశ మరుగుదెంచితిమి.

మా పుణ్యవశమున మిమ్ము బొడఁగంటిమి. సెలవైనయెడ చమత్కృతి వక్కాణింతుమనుటయు నట్టి మాటలకు నారాజు మిగుల నానందించి మంత్రిదిక్కు మొగంబై దుర్బుద్దీ! మన నూతనచర్యాస్థాపనవలన నెట్టి ఖ్యాతి కలిగినదో వింటివా? మనకుఁ గడుదూరముగానున్న కాశ్మీరదేశములో సైతము మనపేరు వాడుకపడియున్న దఁట మేలుమేలని సంతసించు రాజుతో మంత్రి యిట్లనియె.

దేవా! కాశ్మీరదేశ మొకటననేల? భూమండలమంతయు మన పేరుప్రతిష్ఠలు వ్యాపకమైయున్నవి. ఆయాదేశములనుండి వచ్చుచున్న వార్తాపత్రికలవలన నవ్విధమెల్లఁ దెల్లమగుచున్నది. తమకుఁగల బుద్ధికుశలత మఱియొకరాజునకుఁ గలదా? ఎప్పుడును గ్రొత్తమార్గములే విమర్శింపుచుందురు గదా? దీని మూలమునఁ దమకు శిబి, కర్ణ, బలి ప్రముఖులకు దాతృత్వము వచ్చినదానికన్న నధికమగు యశంబు