పుట:కాశీమజిలీకథలు -01.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దేశమునకు వచ్చితిని. వచ్చినతోడనే నా కొకబ్రాహ్మణుఁడు గన్నెనిచ్చెదనని చెప్పిన పూర్వకర్మదోషము వలన సమ్మతించి యక్కన్యం బెండ్లి యాడితి. పెండ్లియైన నాలుగైదేండ్లకే యది కాపురమునకు వచ్చినది. కాని నాకెంతమాత్రము సౌఖ్యము లేక పోయినది. దేవరవారితో నసత్యముఁ జెప్పరాదుగదా! మిగుల యౌవనముగల విద్యార్ధులు నాయొద్దఁ జదువుచుండిరి. అది తరచు వారితో మాటాడుటయు నవ్వుటయుఁ బరిహాసము చేయుటయు జూచుటయు మొదలగు శృంగారచేష్టలు నా మనంబునకుఁ బరితాపము గలుగఁజేసినవి. లోకులు నన్నుఁ జూచి నవ్వసాగిరి. మొదట నా కెంత ఖ్యాతివచ్చినదో భార్యమూలముగా నంత యపఖ్యాతి వచ్చినది. అప్పుడు సహింపలేక యొకనీతిశాస్త్రమునందుఁ జెప్పినచొప్పున నెవ్వరికిఁ దెలియకుండ నిల్లువెడలి దేశాంతర మరుగుటకై నడుచుచుంటిని. ఇంతలో నీ నలువురు నన్నుఁ గలసికొని నే నెన్నివిధముల వలదని చెప్పినను వినక నాతోఁ గూడవచ్చిరి. మే మేగురము నీ దినమున జాముప్రొద్దెక్కినవేళ కీయూరు జేరి యీవీథిలో విశ్రమించియుంటి మింతలో నీయింటి వాల్గంటి నీటి కరుగుచు మీ రెవ్వరని యడిగిన మేము పరదేశులమంటిమి. కారనియె. మఱల మార్గస్థుల మనినను కారని యుత్తరం బిచ్చిన బాటసారులమని చెప్పితిమి. దాని కామె తల ద్రిప్పిన నేమియుం దోఁచక వెఱ్ఱిమూఢులమంటిమి. అప్పుడుగూడ కారని యామె యింటికరిగినది. ఆ మాటలకు మిగులఁ జింతించి యనేకగ్రంథముల జదివితిమి గాని మే మెట్టివారమని చెప్పవలెనో మాకుఁ దెలిసినదికాదు. మా సంగతి నీవే చెప్పవలయునవి యామెను మిగుల బ్రతిమాలితిమి. ఆమెయు భోజనమైన వెనుక జెప్పెదనని మమ్ము నిక్కడకుఁ దీసికొనివచ్చి మాతో మీరు త్వరగా వంటజేసికొని భోజనముఁజేసి పొండు. నా మగఁడు వచ్చెనేని మిమ్మును నన్నుగూడ దండించునని యామె మొదటనే చెప్పినదిగాని మా ఛాందసము వలన వేగిరము తేలినదికాదు. ఇంతలో నాయనయే కాఁబోలు వచ్చి తలుపుమూసి వెళ్ళినవాఁడిదియె మదీయవృత్తాంత మిందింతయైన నసత్యమున్న యెడల దేవరవారు మమ్ము శిక్షింపుఁడని వేడుకొనియెను.

ఓహో! పురోహితునికిఁ బట్టిన పిచ్చి యీతనికిం బట్టినదే. ఇట్టి ఛాందసుల నందఱ నొక్కచోటికిఁ దెచ్చిన దైవమును మెచ్చుకొనవలెను. మేలు మేలు, వీరి భార్యలయందు లేశమైన దోసమున్నట్లు కాన్పింపదు. "వృద్ధస్య తరుణి విషం" అను రీతి వీరికిఁదోచిన యనుమానమే కాని యొండుగాదు. వీరి బుద్ధుల జక్కఁబరచెదనని తలంచి పురోహితుని మొగముఁజూచెను. అప్పుడు పురోహితుం డిట్లనియె. భూవరా! నా భార్యయొక్క గుణము తెలిసినదా ? ఎన్నఁడును తానెఱుఁగనివారు. వీథిలోఁ గూర్చుండియుండగా వారితోఁ బరిహాసపు మాటలాడి యింటి కేమిటికిఁ దోడ్కొని రావలయును. ఇంతకన్నఁ దప్పేమున్నది? తప్పక దీనిం దండింపుఁడని పలికిన నవ్విప్రు నాక్షేపించుచు ఛాందసుడా! నీ భార్య యెక్కడనున్నదో చెప్పుమని యడుగు