పుట:కాశీమజిలీకథలు -01.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామిడిపండుకథ

35

నేఁటికిఁ జిక్కిరనియు వారినందఱ రాజుగారికిఁ జూపించు తలంపుతో నా పౌరాణికుండు మహావేగముగాఁ జెమ్మటలు గ్రమ్మఁ బరుగెత్తుకొని పోయెను.

ఆ జనపతియుఁ బరిషేచనము చేయఁబోయి యంతలోఁ బౌరాణికుండు వచ్చెనను వార్తవిని వాకిటకు వచ్చి యతని యాయాసము జూచి యచ్చెరువందుచు నార్యవర్యా! భుజింపకయే యింతలో వచ్చితిరేల? తొందరపని యేమి గలదని యడిగిన నతండు నిట్టూర్పులు నిగుడించుచు నిట్లనియె.

దేవా! దేవరవారు వెనుక ప్రతిజ్ఞ చేసిన సంగతి జ్ఞాపకము చేసికొనవలసిన యవసరము వచ్చినది. నే నింటికి వెళ్ళునప్పటికి నాభార్య యేవురు విటులతో నింటికడ స్వేచ్ఛగా విహరించుచున్నది. కన్నులారఁ జూచితిని. వెంటనే వచ్చినచో దేవరవారికే విశదము కాఁగలదు. ఇంతకుమున్ను నామాటలు దబ్బరగా ద్రోసివేసితిరి. తాళమువేసి వచ్చితిని. ఆలస్యమైనచో దానికి సహకారులు పెక్కండ్రు గలరు. వారికిఁ దెలిసెనేని ముద్రలు విడఁగొట్టి యింటనున్నవారి సాగనంపఁగలరు. కావున వేగముగ వచ్చి చూడవలయునని మిగుల దీనత్వమునఁ బ్రార్ధించుటయు నా నరపతికిఁ బురోహితుని యందు మిగుల ననుగ్రహము గలదు. కావున నావిషయము పరీక్షించుటకు భోజనము చేయకయే కొంతమంది పెద్దమనుష్యుల వెంటఁబెట్టుకొని యక్కుతపకాలంబున వారింటి కరిగెను. అంతట పురోహితుఁడు బీగముల విడఁదీసెను. అందఱు లోపలకుఁ బోయిరి. భూపతి యా విటు లెక్కడున్నారని యడిగిన నతం డిది యిటురండి. ఈ మూలగదిలో నున్నవారిని యా గదియొద్దకుఁ దీసికొనిపోయి బీగమును గొళ్ళెముదీసి తలుపులు తెరచినంత నా గదిలో నేవురు శ్రోత్రియులు శంకరావతారములవలెఁ దెల్లనివిభూతియు రుద్రాక్షలు నొడలమెరయ దేవతార్చనలు సేయుచు దలుపు మూసినది మొదలు దిగులుపడి దైవమును ధ్యానించుచున్నవారిం గాంచిరి. అప్పుడా యొడయండు మనంబున నద్భుతపడి పురోహితునితో నార్యా! విటులు వీరే కాదా? యని పరిహాసముగా నడిగిన నతండు దేవా! వీరే నే నింట లేనప్పుడు నా యింటిలోఁ బ్రవేశించి పెద్దమనుష్యులవలె నటించు జారపురుషు లనుటయు రాజు వారినందఱ దరికిఁజేరి అయ్యా ! తమరెవరు? ఎక్కడికరుగుచున్నవాఁ రీ యింటి కేల వచ్చితిరి? నిజముఁ జెప్పుడు? చెప్పకున్న దండింతునని యడిగిన నా బ్రాహ్మణులు గడగడ వడఁకఁ దొడంగిరి. శుద్ధమతి యెట్టకేలకుఁ గొంచెము ధైర్యము దెచ్చికొని రాజుగారితో నయ్యా! మీ రెవ్వరని యడిగినందులకు నుత్తరము జెప్పలేము. మే మెవ్వరమో తెలిసికొనుటకై కాదా మే మీ యింటి కరుగుదెంచితిమి. మా వృత్తాంతము వినుండు యదార్ధముగా వక్కాణింతుము.

నాకుఁ జిన్నతనమందే తల్లి దండ్రులు గతించుటచేఁ గాశికరిగి నలువదియేండ్లు పెక్కువిద్యలం జదివితిని. అందుపాధ్యాయపదము వచ్చినతోడనే యట నిలువలేక