పుట:కాశీమజిలీకథలు -01.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అనఁగా దనభార్య జారిణియైనచో నెరిఁగియు నెరుగనట్లూరకుండుటయే మొదటిపక్ష మనియు, నట్లూరకుండలేనివాఁడు దేశాంతర మరుగవలయు నది రెండవపక్ష మనియు, దానికి సమ్మతింపనివానికి మరణమే మేలనియు నీ మూఁడుప్రకారములచేతను అపఖ్యాతి భయము నొందనేరఁడనియు నర్థము. అట్టి శ్లోకము పలుమారు శోధించి యాద్యంతములకు సమ్మతింపక దేశాంతర మరుగుటయే నీతి యనియు "దేశాంతరం వా గంతవ్యం" అనుచోట భార్యతోడనా యొంటరిగానా యను విషయముఁగొంతచర్చించి భార్యతో నఱిగినచో నచ్చటసైత మీ దుర్మార్గురాండ్ర మూలముగా నపఖ్యాతి వ్యాపింపగలదు. కావున నొంటరిగానే యని నిశ్చయించి యొక్కనాఁ డర్ధరాత్రంబున నొరు లెరుంగఁకుండ దర్భాసనమును గొన్నిపుస్తకములు దేవతార్చనసంచియు మూటగట్టుకొని గుట్టుగా నిల్లువెడలి యడవిమార్గంబున బడిపోవుచుండెను.

మఱియు గురుని మత మదివరకే దెలిసికొనిన విద్యార్థులు నలువురు మాత్ర మాయనతోఁ ప్రయాణమై పోవలయునని యెంచి మూటలు గట్టికొని కాచియుండిరి. నిద్రావశంవదులగుటచే నెఱుఁగక యాయనతోడ నరుగలేకపోయిరి. మాయావధిలో మెలకువ వచ్చుటచే నాయనజాడబట్టి యిల్లువెడలి యాయన పోయినమార్గముననే వీరును నడువసాగిరి. విద్యార్థులును నించుమించుగా చాందసంబున గురునితో సమానులే. శిష్యులు మిగుల బలముగలవారగుట వడివడి నడిచి తెల్లవారునంతలో గురువుగారిం గలిసికొనిరి. ఆయన తనవెంట వచ్చు విద్యార్ధులం గాంచి వారు తన్నింటికిఁ బిలిచికొనిపోవుటకునై వచ్చుచున్నారని యెంచి వారి కగబడనట్లు మిగులవేగముగా నడువసాగెను. కాని యంతలో వారు గలిసికొనుటచే నతని ప్రయత్నము గొనసాగినది కాదు. పిమ్మట శిష్యులనుజూచి యతఁడు మీరేల నావెంట వచ్చుచుండిరని యడిగిన వారు అయ్యా! మాకింకను విద్య పూర్తికాలేదు. తమవంటి యుపాధ్యాయులు దొరకుట దుర్లభము. విద్యాగ్రహణలాలసులమై తమవెంట వచ్చుచుంటి మిదియ మా యభిలాష యని చెప్పిన నితండు ఔనౌను! మీరు నాతో వచ్చెడు కారణము నేనెఱుంగుదు. నాభార్య జారిణియని ప్రకటించి నాయపఖ్యాతి వెల్లడిఁ జేయబూనితి గాబోలు! మీరు నాతో రావలదు. మీయుష్టమువచ్చినచోటున కరుగుడు. నే నిక్కడనుండి కదలనని నేలం జతికిలఁబడియెను. వా రామాట కాశ్చర్యపడి చెవులు మూసికొని శివశివా ! మే మాసంగతియే యెఱుఁగమే! మాకు విద్యాసక్తియేగాని వేరుగొడవలేదు. మీ రేమిటికి దేశాంతర మరుగుచుంటిరో మాకుఁ తెలియదు. మా కామె తల్లిగాదా? యామె విషయమై మే మనఁగలమా? మీపాదము లాన మేము చదువుటకుఁదప్ప మరియొకపనికి మీతో వచ్చుటలేదు. మమ్ముఁ గొనిపొండని యాతని పాదములం బడి లేవకుండుటయు దాని కతఁ డెన్నివిధములనో ప్రతికూలవాక్యములను జెప్పెనుగాని వారి ప్రార్థనచే