పుట:కాశీమజిలీకథలు -01.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామిడిపండుకథ

33

సమ్మతింపక తీరినదికాదు. గురువుగారు అనుమతించిన పిమ్మట శిష్యులు వారి దర్భాసనమును దేవతార్చనసంచియుఁ దోవతులమూటయుఁ వారు గైకొని యాయనవెనుక నడువసాగిరి. అ ట్లాఛాందసు లేవురు నడిచి నడిచి జాముప్రొద్దెక్కు సరి కొకబట్టణముఁ జేరిరి. ఆ పురిలో నొకబ్రాహ్మణవీథిం బోవుచు గమనాయాసము వాయ విశ్రమింపఁదలంచి యిరుగెలంకుల నరుగులున్నను వానిమీఁద వసింపక వీథిలోనే మూటలు దింపి కూర్చుండి మార్గాయాసము వాయ దోవతిచరఁగుల విసరికొనుచుండిరి.

అట్టి సమయమున నాప్రాంతమందలి యొకగృహస్థుని భార్య మంచినీరు దెచ్చుటకై బావికరుగుచు మార్గమునఁ గూర్చుండియున్న యా చాందసులం గాంచి, అయ్యా! మీరెవ్వరని యడిగినది. ఆ మాట విని వారు అమ్మా మేము పరదేశుల మనిరి. ఆమెయు మీరు పరదేశులు కారని నుడివి కలశము గొని బావి కరిగినది. ఆమె మఱల వచ్చునప్పటికి వారొండొరు లాలోచించుకొని అమ్మా! మేము పరదేశులము కానిచో మార్గస్థులమైనఁ గామా యనిరి. అప్పుడు ఆమె మీరు మార్గస్థులును గారని నుడివి యింటికేగినది. ఆమె క్రమ్మర వచ్చులోపల వీ రాలోచించుకొని తల్లీ! మేము మార్గస్తులమును గానిచో బాటసారులమని చెప్పుచున్నార మనిరి. అప్పుడును కారని చెప్పి యా చిన్నది బావి కరిగినది. వారపు డోహో యిది చిత్రము. ఈ గ్రామంబున నాఁడువాండ్రకు సైతము పాండిత్యము కలదు గాఁబోలు. మన మన్న పదముల కర్థము వేరుకలదా యేమి? అనేకశాస్త్రములు చదివితిమిగాని మనమెవ్వరమో తెలియకున్నదే! ఈసారి యేమని చెప్పుదము. ఎట్టి పేరు నుడివినను నీ కాంత సమ్మతింపదే యని యాందోళితమానసులై చింతించుచుండ నయ్యండజయానయుఁ దన కలశమెత్తుకొని యాదండ నిలువంబడిన వా రేమియుం బలుకనేరక అమ్మా! మేము శుద్థవెఱ్ఱిమూఢుల మనిరి. ఆమాట కామె లోన నవ్వుకొని వెఱ్ఱిమూఢులు గారని పలికి యింటి కరిగెను. పిమ్మట వా రత్యంతవిషాదదోదూయమానమానసులై యోహో మన మన్యదేశ మరుగుచుంటిమి. పెక్కండ్రు పండితులతో సంభాషింపవలసి వచ్చును. మన మెవ్వరమో తెలిసికొని యేగుట మంచిది. అని నిశ్చయించి యామె మరల వచ్చునేమో యని యట్టె కూర్చుండిరి. ఆమెయు నీళ్ళు తెచ్చుట చాలించి చేద దీసికొని వచ్చుటకు మరల వీథికి రాగానే యీ బ్రాహ్మణులు తటాలునలేచి యామెకు వందనము జేయఁబోయి యామెచే వారింపంబడి అమ్మా! నీవు మహావిద్వాంసురాలవుగాఁ దోచుచున్నావు. మే మనేకశాస్త్రములు చదివితిమిగాని మే మెవ్వరమో మాకుం దెలిసినది కాదు.

నాలుగువిధముల పేరులు సెప్పినను కాదంటివి. మాయం దనుగ్రహముంచి మే మెవ్వరమో? యేమనవలయునో? యెఱింగించిన విని సంతసించి యరుగుచున్న