పుట:కాశీమజిలీకథలు -01.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామిడిపండుకథ

31

వాఁడని యెంచక పదియేఁడు ప్రాయము గల చక్కని తనకూఁతు నాయన కిచ్చి వివాహము గావించెను. వివాహమైన నాలుగేండ్ల కత్తరుణి కాపురమునకు వచ్చినది. అత్తవారింట విద్యార్ధులే గాని యాఁడుతోడులేమింజేసి యా యింతి కొన్నాళ్ళదనుక లజ్జవతిగ నుండి పిదప బ్రౌఢగా సంచరింపం దొడంగినది. మిక్కిలి గుణవంతురాలగు నా చిన్నది విద్యార్థులనెల్ల పుత్రులుగా భావించుకొనుచు వారితోఁ గడుఁచనువుగా మాట్లాడుచుండును. అట్టి స్థితిని జూచి యావృద్ధబ్రాహ్మణుఁ డామె విషయమై యనుమానము జెంది యొకనాఁ డిట్లని తలంచె. ఓహూ! స్త్రీలు దుష్టమతులని యెరింగియుండియు దీనిని విద్యార్ధులతో నింతచనువుగా మాట్లాడనిచ్చిన నాకంటె మూఢుఁడు గలడే. "బలవానింద్రియ గ్రామో విద్వాంసమపికర్షతి" యను శాస్త్రబోధ నెన్నటికేనియు మరువఁబోలునే. ఎంతదృడమైన స్త్రీలమనస్సులును పురుషులు సమీపించినతోడనే చలింపక మానవు. అట్టి స్త్రీలచరిత్రల పెక్కుజ్ఞాపకము దెచ్చికొని విద్యార్థులకును భార్యకును సంబంధము కలిగియున్నదని ధ్రువపరచి యామె నవ్వినను మాట్లాడినను చూచినను విద్యార్థుల నిమిత్తమేయనియు నదియు నొకవిధమైన సాంకేతికమే యనియుఁ దలంచుచు విద్యార్థులకు బాఠము జెప్పుట మాని సర్వకాలసర్వావస్థలయందు నామెను విడువక తిరుగుచుండును.

వీధుల నెవ్వరేని మాట్లాడుకొనినను నవ్వుకొనినను నేకాంతముఁ జెప్పకొన్నను తన భార్య జారత్వవిషయమే యనియుఁ దనకు మిగుల నపకీర్తి వచ్చినదనియు భావించి యధికచింతాకులస్వాంతుఁడై యొకనాఁ డయ్యో దైవమా! నే ననేకవిద్యలం జదివి మిగులఖ్యాతి జెంది కాశి నుండక యిచ్చటి కేల వచ్చితిని? వచ్చియు విచ్చలవిడి సంచరింపక గుదిబండం దగులుచుకొన్న ట్లేలఁ బెండ్లియాడితిని. పెండ్లియాడినను నిట్టి దుర్మార్గురాలు దొరకవలెనా కటాకటా! నా ఖ్యాతి యంతయు నొకకాంతమూలముగా నశించుచున్నది. నే నేమి చేయుదును. స్త్రీమూలముగా నెంతవానికి నపఖ్యాతి రాక మానదు. బృహస్పతి యంత వానికిఁ గళంకము దెచ్చిపెట్టిన స్త్రీజాతిని నమ్మినఁ జెడకుందురా? ఛీ! ఛీ! ఇట్టియపకీర్తి మోచికొని యుండుటకంటె మరణమే మేలుగదా. అయ్యో! యెన్నినాళ్లో శ్రమపడి చదివిన చదువంతయు గంగపాలుగాఁగ నూరక చావవలసివచ్చెనే యని పలుదెరంగుల విచారించి భార్య జారిణియైన తరిఁ జేయఁదగిన కృత్యములు వ్రాసియున్న నీతిశాస్త్ర మొకండు చెప్పిచూచిన నందిట్లు వ్రాయబడి యున్నది.

శ్లో. "కులటా యది జాయచేన్మానమేవ ప్రజేతుధిః
    దేశాంతరంవా గంతవ్యం మరణం బాసి లోచతే
    ఏతత్త్రభిః ప్రకార్తెస్తు నాపఖ్యాతిభయం భవేత్"